తెలంగాణ ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు

RTC sleeper buses from today - Sakshi

లహరి పేరుతో బస్సులను రోడ్డెక్కిస్తున్న సంస్థ

బెంగళూరు, చెన్నై, హుబ్లీ, తిరుపతి, విశాఖపట్నంలకు సేవలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్‌ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది.

టెండర్‌ ద్వారా అశోక్‌ లేలాండ్‌ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్‌ బస్సులను తొలుత హైదరాబాద్‌ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్‌ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్‌ఈఎల్, ఎంజీబీఎస్‌ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్‌ కంటే ఈ బస్సుల్లో టికెట్‌ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది.

రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్‌ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్‌ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్‌ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్‌  చార్జింగ్‌ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్‌ బటన్, రేర్‌ వ్యూ కెమెరా, ఎల్‌ఈడీ సూచిక బోర్డులుంటాయి.  

ప్రారంభోత్సవ ఆఫర్‌..
ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్‌ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్‌ ధరలను తగ్గించనున్నారు.

డైనమిక్‌ ఫేర్‌ విధానం ప్రారంభం..
డైనమిక్‌ టికెట్‌ ఫేర్‌ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది.  తొలిసారి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల తరహాలో డిమాండ్‌ ఆధారంగా టికెట్‌ ధరలను సవరిస్తారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్‌ ధర ఎక్కువగా, డిమాండ్‌ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు.

ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ డెవలపింగ్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్‌ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్‌ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top