‘పోలవరం–నల్లమలసాగర్‌’ డీపీఆర్‌ టెండర్‌కు ఆమోదం | AP Govt Approval for Polavaram-Nallamalasagar DPR tender: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘పోలవరం–నల్లమలసాగర్‌’ డీపీఆర్‌ టెండర్‌కు ఆమోదం

Jan 2 2026 4:04 AM | Updated on Jan 2 2026 4:04 AM

AP Govt Approval for Polavaram-Nallamalasagar DPR tender: Andhra Pradesh

రూ.7.67 కోట్లకు ఐఐసీ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగింత

కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకూ సాంకేతిక సహకారం అందించాలి

పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలూ చేయాలని షరతు

సాక్షి, అమరావతి : పోలవరం–బనకచర్ల అనుసంధానం (లింక్‌) ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. రూ.7.67 కోట్లకు ఐఐసీ టెక్నాలజీస్‌కు అప్పగించింది. పోలవరం–బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును నల్లమలసాగర్‌ వరకే పరిమితం చేస్తూ.. ఆ లింక్‌ ప్రాజెక్టు చేపట్టడానికి డీపీఆర్‌ తయారీతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే పనులకు నవంబరు 27న జలవనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఈపీసీ (ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌) పద్ధతిలో ఏడాదిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈ టెండర్‌లో రూ.7,67,56,539లకు కోట్‌చేసి ఐఐసీ టెక్నాలజీస్‌ ఎల్‌–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని గుంటూరు జిల్లా ఎస్‌ఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డీపీఆర్‌ తయారీలో భాగంగా లైడార్‌ సర్వే చేయాలని నిర్దేశించింది. ఈ లింక్‌ ప్రాజెక్టును మూడు భాగాలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పోలవరం నుంచి కృష్ణా నదిలోకి గోదావరి జలాల మళ్లింపు.. రెండో దశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు మళ్లింపు.. మూడో దశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్‌కు తరలించేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. లైడార్‌ సర్వేలో ఈ మూడు భాగాల్లో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి.. గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్లను ఏర్పాటుచేయాలని.. పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని టెండర్లలో షరతు విధించింది. 

అక్టోబరు 7న పిలిచిన టెండర్లు రద్దు..
ఇక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీ, అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు జలవనరుల శాఖ అక్టోబరు 7న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువను రూ.9.20 కోట్లుగా నిర్ణయించింది. టెండర్‌లో బిడ్‌ల దాఖలు గడువు గత అక్టోబరు 22తో ముగిసింది. కానీ, ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్‌ను రద్దుచేసింది.

ఆ లింక్‌ ప్రాజెక్టును పోలవరం–నల్లమలసాగర్‌కే పరిమితం చేసి డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలిచింది. ఇకపోతే.. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత ఏడాది మే 22న పీఎఫ్‌ఆర్‌ (ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు)ను రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దీనిపై సీడబ్ల్యూసీ బేసిన్‌ పరిధిలోని అన్ని రాష్ట్రాలు.. గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయాలను కోరింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల (టీఓఆర్‌–టెరŠమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ) జూన్‌ 30న తోసిపుచ్చింది.

గోదావరి నదిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్న తర్వాతే టీఓఆర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనుల నిమిత్తం పర్యావరణ, వైల్డ్‌లైఫ్‌ (వన్యప్రాణులు), అటవీ అనుమతుల కోసం అవసరమైన నివేదికల తయారీ పనులను గతేడాది జనవరి 26న రూ.1.77 కోట్లకు ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement