సెకండరీ హెల్త్ ఆస్పత్రులకు 230 వాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్లు కొనుగోలుకు నిర్ణయం
ఒక్కో ఎక్స్‌ట్రాక్టర్ ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.25 లక్షలలోపే
అస్మదీయుల అండతో రూ.3.13 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం
తద్వారా రూ.4 కోట్లకు పైగా నిధులు కొట్టేసేందుకు స్కెచ్
ఇప్పటికే ఖరారైన టెండర్.. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడమే తరువాయి
ఇదే పరికరాన్ని రూ.1.04 లక్షలకే తెలంగాణ సర్కారుకు సరఫరా చేసిన తయారీ సంస్థ
కూటమి నేతలు, అధికారులకు భారీ ఎత్తున కమీషన్లు ముట్టజెప్పేలా ఒప్పందం
సాక్షి, అమరావతి: రూపాయి వస్తువును పది రూపాయలకు కొనడం.. అదనంగా వెచ్చించే సొమ్మును కాంట్రాక్టర్ ద్వారా కమీషన్ల రూపంలో జేబుల్లో వేసుకోవడంలో అరితేరిపోయారు ప్రభుత్వ పెద్దలు. వీరి ధనదాహానికి కొందరు అధికారులు కూడా తోడై ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. చివరకు ప్రజారోగ్యానికి భరోసాగా నిలవాల్సిన ఆరోగ్య శాఖను సైతం వదలకుండా దోచేస్తున్నారు. వైద్య పరికరాల మాటున భారీ స్కామ్‌లకు పాల్పడుతున్నారు. పరికరాల కొనుగోళ్లలో ధరలను అమాంతం పెంచేసి కమీషన్ల రూపంలో అధికారులు, నేతలు పెద్దఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రులకు వాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్ పరికరాల కొనుగోలు కుంభకోణమే దీనికి తాజా ఉదాహరణ.
రూ.4 కోట్లకు పైనే కొట్టేసేలా కుట్ర
సాధారణ ప్రసవం సందర్భంగా తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చే సమయంలో అవరోధాలు ఉంటే.. శిశువును బయటకు తీయడం కోసం వాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్‌ను ఉపయోగిస్తారు. వీటిని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయడం కోసం గత ఏడాది సెపె్టంబర్‌లో ఒక్కో పరికరానికి రూ.3,13,598 చొప్పున వెచ్చించేలా ఏపీఎంఎస్‌ఐడీసీ రేట్ కాంట్రాక్ట్ ఖరారు చేసింది. మెడిసిల్ కంపెనీకి చెందిన ఈ పరికరాలను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు విశాఖ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది.
వాస్తవానికి ఇదే పరికరాన్ని తయారీ సంస్థ (మెడిసిల్) రూ.1.04 లక్షలకు హైదరాబాద్‌లోని పేట్లబుర్జు మహాత్మాగాంధీ మెటర్నిటీ హాస్పిటల్(ఎంజీఎంహెచ్)కు సరఫరా చేసింది. 2021–22 మధ్య రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల ధరకు తయారీ సంస్థ పరికరాలను విక్రయించింది. ఈ అంశాలన్నింటినీ గతేడాది తెలంగాణ ఎంఎస్‌ఐడీసీ నిర్వహించిన ఓ టెండర్‌లో మెడిసిల్ సంస్థ స్పష్టం చేసింది. కాగా, ఇదే కంపెనీకి చెందిన పరికరాన్ని ఏకంగా రూ.3.13 లక్షలకు కొనుగోలు చేసేలా ఏపీ వైద్య శాఖ రేట్ కాంట్రాక్ట్ ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఒక్కో వాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్ ధర రూ.1.50 లక్షల కంటే ఎక్కువ ఉండదని మెడికల్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఎంఎస్‌ఐడీసీ టెండర్లలో తయారీ సంస్థలు కాకుండా డీలర్స్ పాల్గొంటూ ఉంటారు. వీరు 10 శాతం నుంచి 20 శాతం మేర మార్జిన్ పెట్టుకుని టెండర్లు వేస్తుంటారు. అయితే, కాంట్రాక్ట్ సంస్థ ఏకంగా రెండు రెట్లు అధికంగా ధరలు వేయడం వెనుక నేతలు, అధికారుల హస్తం ఉందని తెలుస్తోంది.
భారీ అవినీతికి స్కెచ్
గతేడాది సెపె్టంబర్‌లో ప్రభుత్వం రేట్ కాంట్రాక్ట్ ఖరారు చేయడం వెనుక భారీ అవినీతి స్కెచ్ ఉంది. అప్పట్లో పది పరికరాలను కొనుగోలు చేయడానికి రేటు కాంట్రాక్టు ఖరారు చేశారు. అనంతరం రెండు నెలలకే సెకండరీ హెల్త్ ఆస్పత్రులకు 230 వాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్‌ల అవసరం ఉందని ఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ వచ్చినట్టు సమాచారం. వీటి కొనుగోలు చేసేందుకు ఎంఎస్‌ఐడీసీ ఖరారు చేసిన ధర ప్రకారం రూ.7 కోట్లకు పైగానే ఖర్చవుతుంది. అదే తయారీ సంస్థ వాస్తవ ధరలతో పోలిస్తే రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్లలోపే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన అధిక ధరకు పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా రూ.4 కోట్ల మేర కమీషన్ల రూపంలో కొందరు అధికారులు, నేతలు కొల్లగొట్టడానికి స్కెచ్ వేసినట్టు తేటతెల్లం అవుతోంది. ఇదే ధరలో కాంట్రాక్ట్ సంస్థకు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేందుకు వైద్య శాఖ సిద్ధమవుతోంది.


