డిజైన్‌ లోపంతోనే మరణ మృదంగం | Death toll in sleeper bus accidents rising | Sakshi
Sakshi News home page

డిజైన్‌ లోపంతోనే మరణ మృదంగం

Oct 26 2025 5:58 AM | Updated on Oct 26 2025 5:58 AM

Death toll in sleeper bus accidents rising

స్లీపర్‌ బస్సు ప్రమాదాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య  

ఏఐఎస్‌ ప్రమాణాలు బేఖాతరు 

ఇష్టానుసారంగా బస్సుల బాడీ బిల్డింగ్‌ 

కర్నూలు స్లీపర్‌ బస్సు ప్రమాదంతో మరోసారి బట్టబయలు 

చైనా, జర్మనీ తదితర దేశాల్లో స్లీపర్‌ బస్సులపై నిషేధం

సాక్షి, అమరావతి : స్లీపర్‌ బస్సుల డిజైన్‌ లోపమే ప్రయాణికుల పాలిట మరణమృదంగం మోగిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు, ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణానికి స్లీపర్‌ బస్సుల డిజైన్‌  ఎంతమాత్రం అనుకూలం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బస్‌ ఆపరేటర్లు లాభాపేక్షతో ఏఐఎస్‌ ప్రమాణాలను బేఖాతరు చేస్తుండటం సామాన్య ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతోంది. 

కర్నూలు జిల్లాలో 19మంది సజీవ దహనమైన కావేరీ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం మరోసారి స్లీపర్‌ బస్సుల్లో భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చింది. కాగా చైనా, జర్మనీతోపాటు పలు యూరోపియన్‌ దేశాలు స్లీపర్‌ బస్సులను నిషేధించిన విషయాన్ని నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.   

ట్యాంకు, బ్యాటరీ పక్క పక్కనే.. 
ఫ్యూయల్‌ ట్యాంకు, బ్యాటరీ కాంపోనెంట్‌ పక్కపక్కనే ఉండటం స్లీపర్‌ బస్సుల డిజైన్‌లో ప్రధానలోపం. దాంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణం మంటలు చెలరేగి బస్సు కేవలం కొన్ని నిముషాల్లోనే దగ్ధమైపోతోంది. 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెంలో బస్సుప్రమాదం తీవ్రత పెరగడానికి అదే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున సంభవించిన ప్రమాద తీవ్రతకు కూడా అదే కారణమై ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.   

సీజీ లోపం.. బోల్తా కొడుతున్న బస్సులు 
స్లీపర్‌ బస్సుల్లో  సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ(సీజీ) సక్రమంగా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బరువైన ఇంజిన్, చాసిస్‌ అట్టడుగున ఉండటంతో సీజీ తక్కువగా ఉంటోంది. అప్పర్‌ బెర్త్‌లపైకి ప్రయాణికులు చేరుకోగానే సీజీ పెరిగి బస్సు స్థిరత్వం తగ్గుతుంది. ఇక నిర్దేశిత ప్రమాణాల కంటే స్లీపర్‌ బస్సులు ఎత్తు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో కూడా సీజీ తగ్గుతోంది. బస్సు ఇరుకైన మలుపుల్లో తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై ఏదైనా హఠాత్తుగా అడ్డం వస్తే బ్రేక్‌ వేయగానే  బస్సు వెంటనే అదుపు తప్పి బోల్తా పడుతోంది.   

తప్పించుకునేందుకు ఐదు నిమిషాలే సమయం.. 
స్లీపర్‌ బస్సుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునేందుకు గరిష్టంగా ఐదారు నిమిషాలే సమయం ఉంటుంది. ఆ అయిదు నిమిషాల్లో బస్సులో ఉండే 35 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. బస్సుకు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే తలుపులు లాక్‌ అయిపోతాయి. ప్రయాణికులు అందరూ వెనుక వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. అయిదు నిముషాల్లో ప్రయాణికులు అందరూ బయటపడటం కష్టసాధ్యం.   

ఇరుకైన మార్గం 
స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణికులు అటూ ఇటూ వెళ్లేందుకు రెండు వైపులా ఉండే బెర్త్‌ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఓ వైపు రెండు బెర్త్‌లు మరో వైపు ఒక బెర్త్‌తో సీట్లు ఉంటాయి. సాధాణంగా ఒక స్లీపర్‌ బస్సులో 33 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. మల్టీ యాక్సెల్‌ బస్సుల్లో 36 నుంచి 40 బెర్త్‌ల వరకు ఏర్పాటు చేస్తారు. ఆ బెర్త్‌ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే అదీ నెమ్మదిగా నడిచేందుకు అవకాశం ఉంటుంది. 

సాధారణ పరిస్థితుల్లోనే ఒకేసారి ఇద్దరు మనుషులు నడిచేందుకు అవకాశం ఉండదు. అటువంటిది ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికుల కంగారు, ఆందోళనతో ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీస్తుంది. దాంతో మృతుల సంఖ్య పెరుగుతుంది.  

డ్రైవర్లకు మగత... 
స్లీపర్‌ బస్సులు ఉదయం వేళల్లో ప్రయాణానికి డిజైన్‌ చేసినవి. రాత్రి వేళల్లో ప్రయాణానికి ఉద్దేశించినవి కావు. రాత్రి వేళల్లో స్లీపర్‌ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్‌బస్సుల్లో వాతావరణం చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. దీనికి తోడు చుట్టూ చీకటి, బస్సు అత్యంత వేగంతో దూసుకుపోతుండటంతో డ్రైవర్లను మగత కమ్మేస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమకు కొంత మగత కమ్ముతుందని 2018లో కేంద్ర రవాణాశాఖ నిర్వహించిన సర్వేలో కొందరు డ్రైవర్లు చెప్పడం గమనార్హం.  

చైనా, జర్మనీలలో నిషేధం 
డిజైన్‌ లోపం కారణంగా స్లీపర్‌ బస్సులను పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. చైనా 13 ఏళ్ల క్రితమే స్లీపర్‌ బస్సును నిషేధించడం గమనార్హం. 2009 నుంచి 2012 మధ్య చైనాలో స్లీపర్‌ బస్సుల ప్రమాదాల్లో ఏకంగా 252 మంది మరణించారు. 

అన్ని ప్రమాదాలూ తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 5గంటల మధ్యే సంభవించాయి. స్లీపర్‌ బస్సులపై అధ్యయనంలో నిపుణులు వాటి డిజైన్‌ లోనే లోపం ఉందని గుర్తించారు. ఆ వెంట­నే చైనా ప్రభుత్వం స్లీపర్‌ బస్సుల రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. జర్మనీ 2006లోనే స్లీపర్‌ బస్సుల­ను నిషేధించింది. జర్మనీతోపాటు పలు యూరో­పి­యన్‌ దేశాలు స్లీపర్‌ బస్సులను నిషేధించాయి.  

ఇష్టానుసారం మార్పులు
»  బస్‌ ఆపరేటర్ల లాభాపేక్ష  కూడా ప్రమాదాలలను మరింత పెంచుతోంది. స్లీపర్‌ బస్సుల భద్రతా ప్రమాణాల కోసం ‘ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌–119 (ఏఐఎస్‌ 119)  ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ బస్‌ ఆపరేటర్లు ఆ ప్రమాణాలకు విరుద్ధంగా బస్సుల బాడీ బిల్డింగ్‌ చేస్తున్నారు.   
» ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులు వెంటనే తప్పించుకునేందుకు స్లీపర్‌ బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలు (ఎమర్జెన్సీ విండో) 
ఉండాలి. అందులో రెండు పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఉండాలి. కానీ బస్‌ ఆపరేటర్లు స్లీపర్‌ బస్సుల్లో ఒకట్రెండు ఎమర్జెన్సీ విండోలే ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కూడా ఏర్పాటు చేయడం లేదు. 
»  బస్సులో కింది బెర్త్‌ కనీసం 350 ఎంఎం ఎత్తులో ఉండాలి. కానీ 150 ఎంఎం నుంచి 200 ఎంఎం ఎత్తులోనే కింది బెర్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  
»   బస్సులో మండే స్వభావం అతి తక్కువగా ఉండే మెటీరియల్‌ మాత్రమే వాడాలి. ఈ నిబంధనను బస్సు ఆపరేటర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెర్త్‌ కవర్లు నుంచి కర్టెన్లు, ఇతర వస్తువులన్నీ త్వరగా మండే స్వభావం ఉన్న మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నారు. దాంతో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని కీలలు వేగంగా బస్సంతా వ్యాపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సులో ఇనుప ఉచలు మినహా పూర్తిగా దగ్ధం కావడమే అందుకు ఉదాహరణ.  
»  ప్రమాదం సంభవిస్తే కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు ప్రతి సీటు వద్దా ప్రమాణిక సుత్తి ఉండాలి. కానీ బస్‌ ఆపరేటర్లు వాటిని ఏర్పాటు చేయడం లేదు. 

ఇటీవల జరిగిన కొన్ని స్లీపర్‌ బస్సుల ప్రమాదాలు..
»  2022 అక్టోబరులో మహారాష్ట్రలో వరత్నాయి నుంచి ముంబాయి వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. 
»  2023, జులై 1న మహారాష్ట్రలో ఓ స్లీపర్‌ బస్సు హైవే  డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 25 మంది మృత్యువాత పడ్డారు.
»  2023లో రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు గురుగ్రాం వద్ద ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు. 
»   2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద జరిగిన స్లీపర్‌ బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement