breaking news
Safety issue
-
డిజైన్ లోపంతోనే మరణ మృదంగం
సాక్షి, అమరావతి : స్లీపర్ బస్సుల డిజైన్ లోపమే ప్రయాణికుల పాలిట మరణమృదంగం మోగిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు, ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణానికి స్లీపర్ బస్సుల డిజైన్ ఎంతమాత్రం అనుకూలం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బస్ ఆపరేటర్లు లాభాపేక్షతో ఏఐఎస్ ప్రమాణాలను బేఖాతరు చేస్తుండటం సామాన్య ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతోంది. కర్నూలు జిల్లాలో 19మంది సజీవ దహనమైన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరోసారి స్లీపర్ బస్సుల్లో భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చింది. కాగా చైనా, జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించిన విషయాన్ని నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ట్యాంకు, బ్యాటరీ పక్క పక్కనే.. ఫ్యూయల్ ట్యాంకు, బ్యాటరీ కాంపోనెంట్ పక్కపక్కనే ఉండటం స్లీపర్ బస్సుల డిజైన్‌లో ప్రధానలోపం. దాంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణం మంటలు చెలరేగి బస్సు కేవలం కొన్ని నిముషాల్లోనే దగ్ధమైపోతోంది. 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో బస్సుప్రమాదం తీవ్రత పెరగడానికి అదే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున సంభవించిన ప్రమాద తీవ్రతకు కూడా అదే కారణమై ఉంటుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. సీజీ లోపం.. బోల్తా కొడుతున్న బస్సులు స్లీపర్ బస్సుల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ(సీజీ) సక్రమంగా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బరువైన ఇంజిన్, చాసిస్ అట్టడుగున ఉండటంతో సీజీ తక్కువగా ఉంటోంది. అప్పర్ బెర్త్‌లపైకి ప్రయాణికులు చేరుకోగానే సీజీ పెరిగి బస్సు స్థిరత్వం తగ్గుతుంది. ఇక నిర్దేశిత ప్రమాణాల కంటే స్లీపర్ బస్సులు ఎత్తు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో కూడా సీజీ తగ్గుతోంది. బస్సు ఇరుకైన మలుపుల్లో తిరుగుతున్నప్పుడు, రోడ్డుపై ఏదైనా హఠాత్తుగా అడ్డం వస్తే బ్రేక్ వేయగానే బస్సు వెంటనే అదుపు తప్పి బోల్తా పడుతోంది. తప్పించుకునేందుకు ఐదు నిమిషాలే సమయం.. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునేందుకు గరిష్టంగా ఐదారు నిమిషాలే సమయం ఉంటుంది. ఆ అయిదు నిమిషాల్లో బస్సులో ఉండే 35 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. బస్సుకు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే తలుపులు లాక్ అయిపోతాయి. ప్రయాణికులు అందరూ వెనుక వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. అయిదు నిముషాల్లో ప్రయాణికులు అందరూ బయటపడటం కష్టసాధ్యం. ఇరుకైన మార్గం స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులు అటూ ఇటూ వెళ్లేందుకు రెండు వైపులా ఉండే బెర్త్‌ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఓ వైపు రెండు బెర్త్‌లు మరో వైపు ఒక బెర్త్‌తో సీట్లు ఉంటాయి. సాధాణంగా ఒక స్లీపర్ బస్సులో 33 నుంచి 36 బెర్త్‌లు ఉంటాయి. మల్టీ యాక్సెల్ బస్సుల్లో 36 నుంచి 40 బెర్త్‌ల వరకు ఏర్పాటు చేస్తారు. ఆ బెర్త్‌ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే అదీ నెమ్మదిగా నడిచేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనే ఒకేసారి ఇద్దరు మనుషులు నడిచేందుకు అవకాశం ఉండదు. అటువంటిది ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రయాణికుల కంగారు, ఆందోళనతో ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీస్తుంది. దాంతో మృతుల సంఖ్య పెరుగుతుంది. డ్రైవర్లకు మగత... స్లీపర్ బస్సులు ఉదయం వేళల్లో ప్రయాణానికి డిజైన్ చేసినవి. రాత్రి వేళల్లో ప్రయాణానికి ఉద్దేశించినవి కావు. రాత్రి వేళల్లో స్లీపర్ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు స్లీపర్బస్సుల్లో వాతావరణం చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. దీనికి తోడు చుట్టూ చీకటి, బస్సు అత్యంత వేగంతో దూసుకుపోతుండటంతో డ్రైవర్లను మగత కమ్మేస్తుంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తమకు కొంత మగత కమ్ముతుందని 2018లో కేంద్ర రవాణాశాఖ నిర్వహించిన సర్వేలో కొందరు డ్రైవర్లు చెప్పడం గమనార్హం. చైనా, జర్మనీలలో నిషేధం డిజైన్ లోపం కారణంగా స్లీపర్ బస్సులను పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. చైనా 13 ఏళ్ల క్రితమే స్లీపర్ బస్సును నిషేధించడం గమనార్హం. 2009 నుంచి 2012 మధ్య చైనాలో స్లీపర్ బస్సుల ప్రమాదాల్లో ఏకంగా 252 మంది మరణించారు. అన్ని ప్రమాదాలూ తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 5గంటల మధ్యే సంభవించాయి. స్లీపర్ బస్సులపై అధ్యయనంలో నిపుణులు వాటి డిజైన్ లోనే లోపం ఉందని గుర్తించారు. ఆ వెంటనే చైనా ప్రభుత్వం స్లీపర్ బస్సుల రిజి్రస్టేషన్‌ను నిలిపివేసింది. జర్మనీ 2006లోనే స్లీపర్ బస్సులను నిషేధించింది. జర్మనీతోపాటు పలు యూరోపియన్ దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. ఇష్టానుసారం మార్పులు» బస్ ఆపరేటర్ల లాభాపేక్ష కూడా ప్రమాదాలలను మరింత పెంచుతోంది. స్లీపర్ బస్సుల భద్రతా ప్రమాణాల కోసం ‘ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్–119 (ఏఐఎస్ 119) ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ బస్ ఆపరేటర్లు ఆ ప్రమాణాలకు విరుద్ధంగా బస్సుల బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. » ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులు వెంటనే తప్పించుకునేందుకు స్లీపర్ బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలు (ఎమర్జెన్సీ విండో) ఉండాలి. అందులో రెండు పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు స్లీపర్ బస్సుల్లో ఒకట్రెండు ఎమర్జెన్సీ విండోలే ఏర్పాటు చేస్తున్నారు. పైకప్పు నుంచి బయటకు వచ్చేందుకు ఒక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయడం లేదు. » బస్సులో కింది బెర్త్ కనీసం 350 ఎంఎం ఎత్తులో ఉండాలి. కానీ 150 ఎంఎం నుంచి 200 ఎంఎం ఎత్తులోనే కింది బెర్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. » బస్సులో మండే స్వభావం అతి తక్కువగా ఉండే మెటీరియల్ మాత్రమే వాడాలి. ఈ నిబంధనను బస్సు ఆపరేటర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెర్త్ కవర్లు నుంచి కర్టెన్లు, ఇతర వస్తువులన్నీ త్వరగా మండే స్వభావం ఉన్న మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నారు. దాంతో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని కీలలు వేగంగా బస్సంతా వ్యాపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన బస్సులో ఇనుప ఉచలు మినహా పూర్తిగా దగ్ధం కావడమే అందుకు ఉదాహరణ. » ప్రమాదం సంభవిస్తే కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు ప్రతి సీటు వద్దా ప్రమాణిక సుత్తి ఉండాలి. కానీ బస్ ఆపరేటర్లు వాటిని ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని స్లీపర్ బస్సుల ప్రమాదాలు..» 2022 అక్టోబరులో మహారాష్ట్రలో వరత్నాయి నుంచి ముంబాయి వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. » 2023, జులై 1న మహారాష్ట్రలో ఓ స్లీపర్ బస్సు హైవే డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 25 మంది మృత్యువాత పడ్డారు.» 2023లో రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు గురుగ్రాం వద్ద ప్రమాదానికి గురై 25 మంది మృతి చెందారు. » 2023లో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం చెందారు. -
సాంకేతిక సమస్యతో యూకేలో నిలిచిన విమానాలు
లండన్: సాంకేతిక సమస్య కారణంగా యూకేకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి ఇతరదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్య ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతా నిర్వహణ కోసం ట్రాఫిక్‌పై నియంత్రణలను విధించినట్లు యూకే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. అయితే, సమస్యకు కారణం, ఎప్పటివరకు పరిష్కారమవుతుందనే విషయం సంస్థ తెలపలేదు. సమస్యను సాధ్యమైనంత త్వరంగా పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. యూకే గగనతలాన్ని మాత్రం మూసివేయలేదని స్పష్టతనిచ్చింది. -
బిహార్ కార్మికులూ మా కార్మికులే
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగనివ్వమన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమిళనాడులో బిహార్, జార్ఖండ్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో స్టాలిన్ శనివారం నితీశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవనీయ సోదరుడు నితీశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు అందులో చెప్పారు. బిహార్ సహా ఉత్తరాది వలస కార్మికుల భద్రతపై ఆయనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బిహార్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ తమిళనాడులో వలసకార్మికులపై దాడులపై ఒక ఫేక్ వీడియోను మొదట ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్మికులకు నచ్చజెప్పిన పోలీసులు ఉత్తరాది వలస కార్మికులపై దాడుల పుకార్ల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు బయలు దేరారు. దీంతో బస్, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. రిజర్వేషన్ రైలు బోగీల్లో కార్మికులు పెద్దఎత్తున ఎక్కడంతో శనివారం వారికి పోలీసులు నచ్చజెప్పి కిందికి దించివేశారు. కాగా, ఈ వ్యవహారంపై బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమిళనాడు అధికారులతో సంప్రదింపులు జరిపాయి. అలాగే ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తమిళనాడుకు శనివారం చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాయి. కాగా, వదంతుల వీడియోలకు సంబంధించి పోలీసులు బీజేపీ అధికార ప్రతినిధులు తదితరులపై కేసులు నమోదు చేశారు. -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. ఉల్లంఘనలు ఇలా.. ► భవనం సెల్లార్, గ్రౌండ్ ప్లస్ ఫోర్‌తో పాటు పెంట్ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ మీటర్ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ ఉండాలి. భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్ కేస్ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు. ► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఇందులో వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. నిప్పుల్లో నిబంధనలు అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
భద్రతా లోపాలతో 13 లక్షల వాహనాలు వెనక్కి
న్యూఢిల్లీ: భద్రతా పరమైన లోపాల కారణంగా 13 లక్షల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లను గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) కంపెనీలు వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు తెలిపారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. 8,64,557 ద్విచక్ర వాహనాలు, 4,67,311 ప్యాసింజర్ కార్లు వెనక్కి పిలిచిన వాటిల్లో ఉన్నట్టు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,60,025 ద్విచక్ర వాహనాలు, 25,142 ప్యాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తయారీ అనంతరం లోపాలు బయటపడినప్పుడు ఆయా బ్యాచ్‌ల వారీగా మొత్తం వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వెనక్కి పిలిపించి, అన్నింటినీ సరిచేసిన తర్వాత అప్పగిస్తుంటాయి. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇలా మొత్తం 3.39 లక్షల వాహనాలు, 2019–20లో 2.14 లక్షల వాహనాలను కంపెనీలు వెనక్కి పిలిపించుకున్నాయి. ‘‘ఓ మోటారు వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి లేదా నడిపే వారికి లేదా ఆ వాహనంలో ప్రయాణించే వారికి, లేదంటే రహదారులను వినియోగించుకునే ఇతరులకు ప్రమాదం అని భావిస్తే.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీలను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది’’అని మంత్రి చెప్పారు. -
కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు
న్యూఢిల్లీ: కోడలి నగలను అత్తింటి వారు భద్రపరిస్తే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 498–ఏ సెక్షన్ ప్రకారం అది క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్తింటి వారు తన నగలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారన్న ఆరోపణలపై భర్త, అత్త, బావపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టింది. ఇలా నగలు తీసుకోవడం అత్తింటివారు కోడలిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త తిరిగి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆ భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం విచారించింది. ఎన్ని నగలు తీసుకున్నారో, వాటి విలువ ఎంత అనే వివరాలేవీ పిటిషనర్ వెల్లడించలేదని, తన జీవితం ఏ విధంగా నాశనం చేశారనే విషయాలనూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో నగలు తీసుకోవడం సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ , హరియాణా హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 12 డిసెంబర్ 2021న పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2009లో వివాహం చేసుకున్న వ్యక్తి 2017లో తనకు విడాకులు కావాలంటూ బటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. అందుకు కారణంగా భార్య ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. 2020లో బటిండా ఫ్యామిలీ కోర్టు ఆ రికార్డులను అంగీకరించింది. సంభాషణల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆ మహిళ పంజాబ్,హరియాణా హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె వాదనలతో హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఏకీభవించింది. -
బంగ్లా పర్యటనలో మోదీకి ముప్పు లేదు
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఈ వారాంతంలో పర్యటించ నున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎలాంటి భద్రతా పరమైన ముప్పు లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని వామపక్ష సంస్థలు, కరడుగట్టిన ఇస్లాం గ్రూపులు మోదీ పర్యటనని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి మోదీ ఈ నెల 26,27న బంగ్లా పర్యటనకు వెళుతున్నారు. దేశ స్వాతంత్య్ర వేడుకలతో పాటు బంగాబంధు షేక్ ముజీబర్ రెహ్మాన్ శతజయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. కరోనా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాక మోదీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ‘‘బంగ్లా పర్యటనకు మోదీని ఆహ్వానించడం మాకు గర్వకారణం. ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఏవో కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ల నిరసనలేవో వాళ్లని చేసుకోనిద్దాం. దానికి ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మొమెన్ విలేకరులతో చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవుల దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. విదేశీ ప్రతినిధులందరి రక్షణ బాధ్యత తమదేనని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని మొమెన్ చెప్పారు. -
ఎయిర్ ఏషియాకు షాకిచ్చిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. "భద్రతా ఉల్లంఘనలపై" సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఎయిర్ ఏషియాకు చెందిన మాజీ పైలట్, ప్రముఖ యూట్యూబర్ కెప్టెన్ గౌరవ్ తనేజా ఆరోపణలకు మేరకు డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. జూన్ లోనే వీరికి షోకాజ్ నోటీసుల జారీ చేశామనీ, ఎయిర్ ఏషియా ఇండియా ఆపరేషన్స్ హెడ్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ నేమాను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించామని సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ పరిణామంపై ఎయిర్ ఏషియా ఇంకా స్పందించాల్సి ఉంది. ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నతనేజా ఈ సంవత్సరం జూన్ లో ఎయిర్ ఏషియా ఇండియాపై సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో తనపై వేటు వేశారంటూ ఒక వీడియోను షేర్ చేసిన ఆయన విమానయాన సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిస్తోందని ఆరోపించారు. ప్రయాణీకుల క్షేమం కోసం మాట్లాడినందుకే తనను సస్పెండ్ చేశారంటూ ఒక వివరణాత్మక వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇంధన ఆదా సాకుతో "ఫ్లాప్-3" మోడ్‌లో 98 శాతం ల్యాండింగ్‌లు చేయాలని పైలట్లపై ఒత్తిడి చేస్తోందని, అలా చేయని వారిని ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) ఉల్లంఘనగా పేర్కొంటోందని ఆరోపించారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో సురక్షితమైంది కాదా, లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫ్లాప్-3 ల్యాండింగ్‌లు చేయమంటోందని, ఇది ప్రయాణీకుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ట్విటర్ లో దుమారం రూగింది. దీనిపై స్పందించిన డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించామనీ, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
శ్రీశైలం జలాశయానికి ముప్పులేదు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం భద్రతకు ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టంచేశారు. జలాశయం నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నదుష్ప్రచారాన్నిగురువారం ఆయన ఖండించారు. జలాశయం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లూలేవని తెలిపారు. ఏటా జరిపే జలాశయం నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ఏడాది ‘అండర్ వాటర్ వీడియోగ్రఫీ’ పనులను గోవాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ)కు.. బ్యాతిమెట్రిక్ సర్వే పనులను విశాఖ ఎన్ఐఓకు అప్పగించామన్నారు. ఈ సంస్థల ప్రతినిధులతో అక్టోబర్ 29న శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చర్చించారని చెప్పారు. ఆ రెండు సంస్థలు ఇచ్చే నివేదికలను సీడబ్ల్యూసీ రిటైర్డ్ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీకి పంపుతామని.. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు నిర్వహణ పనులు చేపడతామన్నారు. సీపేజీ పనులను శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు చేపడుతున్నారన్నారు. కాగా, శ్రీశైలం డ్యామ్ భద్రతకు ఎలాంటి ప్రమాదంలేదని సూపరింటెండెంట్ ఇంజినీరు చంద్రశేఖరరావు కూడా అన్నారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రాజేంద్రసింగ్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
ఇండిగోకు మరో షాక్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ, ప్రమోటర్ల వివాదంతో చిక్కుల్లో పడిన ఇండిగోకు మరో షాక్ తగిలింది. ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) ఇండిగో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీజీసీఏ ప్రత్యేక ఆడిట్ బృందం భద్రతా లోపాలను గుర్తించిన నేపథ్యంలో నలుగురు సీనియర్ ఉద్యోగులకు శుక్రవారం నోటీసులిచ్చింది. ట్రైనింగ్ హెడ్ కెప్టెన్ సంజీవ్ భల్లా, చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ కెప్టెన్ హేమంత్ కుమార్, ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషీమ్ మిత్రా, క్యూఏ (క్వాలిటీ అస్యూరెన్స్) కెప్టెన్ రాకేశ్ శ్రీవాస్తవలకు ఈ నోటీసులిచ్చింది. విమానాల ల్యాండింగ్ ప్రమాదాల సంఘటనల నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు , విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 8, 9తేదీల్లో గుర్గావ్లోని ఇండిగో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రధాని జోక్యాన్ని కోరుతున్న గంగ్వాల్ మరోవైపు ఇండిగో ప్రమోటర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కో ప్రమోటర్ రాహుల్ భాటియా అక్రమాలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీకి లేఖ రాసిన ఇండిగో ప్రమోటర్ రాకేశ్ గంగ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. సంస్థ ఎదుర్కొంటున్న కార్పొరేట్ పాలన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. -
తెలుగులో గూగుల్ ‘సేఫ్టీ సెంటర్’ సేవలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారంపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘సేఫ్టీ సెంటర్’ పరిధిని విస్తరిస్తూ తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠి, ఉర్దూ భాషల్లో సేవలందించనుంది. తమ సమాచారాన్ని గూగుల్ ఎలా వాడుకోవచ్చో వినియోగదారులు ప్రాథమ్యాల ప్రాతిపదికగా అనుమతిచ్చే వేదికగా సేఫ్టీసెంటర్ పనిచేస్తుంది. ‘గూగుల్ పౌరుల డేటాను అమ్ముకుంటోందన్న వాదనలు తప్పని సేఫ్టీ సెంటర్ల ద్వారా నిరూపించాం. గూగుల్ ఎందుకు, ఎలాంటి డేటాను సేకరిస్తోంది? డేటాను ఎలా వినియోగిస్తోంది? లాంటి విషయాల్ని వివరించాం. యూజర్ పేరు, పుట్టిన తేదీ, లొకేషన్, బ్రౌజింగ్ చరిత్ర తదితరాలను గూగుల్‌తో పంచుకోవడం ఇష్టం లేకపోతే అలాంటి సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు’ అని సంస్థ తెలిపింది. -
‘ఆధార్’ రిపోర్టర్‌పై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సురక్షితం కాదంటూ ‘ద ట్రిబ్యూన్’ పత్రికలో వచ్చిన కథనంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆధార్ నియంత్రణ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఫిర్యాదు మేరకు.. ఆ కథనాన్ని రాసిన జర్నలిస్టు రచనా ఖైరా పేరును ఎఫ్ఐఆర్లో చేర్చామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేవలం రూ. 500లతో 10 నిమిషాల వ్యవధిలో ఒక ఏజెంట్ ద్వారా యూఐడీఏఐ వద్ద ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ వివరాలు పొందేందుకు అనుమతి సంపాదించామని ట్రిబ్యూన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. వ్యక్తుల పేర్లు, చిరునామా, పోస్టల్ కోడ్, ఫొటో, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వివరాలు చాలా సులువుగా అందాయని తెలిపింది. యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ బీఎం పట్నాయక్ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ, ఆధార్ చట్టాల కింద ‘ద ట్రిబ్యూన్’ జర్నలిస్టు రచనా ఖైరాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ‘ఎవరి ఆధార్ వివరాలైనా పొందేందుకు డబ్బులిచ్చి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సప్ ద్వారా అనుమతి సంపాదించినట్లు మాకు సమాచారం వచ్చింది’ అని యూఐడీఏఐ ఫిర్యాదులో పేర్కొంది. జనవరి 5న ఫిర్యాదు అందగా.. అదే రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ సంపాదించా: రచనా ఖైరా ఈ వ్యవహారంపై రిపోర్టర్ రచనా ఖైరా స్పందిస్తూ.. ‘చివరకు నా కథనంపై యూఐడీఏఐ ఏదొకచర్య తీసుకున్నందుకు ఆనందంగా ఉన్నా.. నేను ఎఫ్ఐఆర్ను సంపాదించుకున్నా’ అని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్తో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూఐడీఏఐ స్పందించింది. పత్రికా స్వేచ్ఛతో పాటు భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామంది. అనధికారికంగా అనుమతి సంపాదించడం వల్లే ఫిర్యాదు చేశామంటూ తన చర్యను సమర్థ్ధించుకుంది. ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన: ఎఫ్ఐఆర్ నమోదుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందో ళన వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. అక్రమాలపై విచారణ చేపట్టకుండా.. వాటిని వెలికి తీసిన వారిని శిక్షిస్తున్నారని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది -
తుప్పు పట్టిన ‘భద్రత’..!
సాక్షి, ముంబై: నగర భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన 26/11 ఘటన నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోనట్లుగానే ప్రవర్తిస్తోంది. నగరంలో నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఉగ్రవాదుల దాడుల భయమూ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నగర రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న భద్రతా సిబ్బందికి తగిన ఆయుధ సంపత్తిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టేందుకు కొన్ని కీలక సంస్థల వద్ద నియమించిన భద్రతా సిబ్బంది వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి ఆయుధాలే ఉన్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి మావోలు, ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్థాపించిన మహారాష్ట్ర భద్రత దళానికి చెందిన జవాన్లవద్ద ఇప్పటికీ 1948 కాలం నాటి ఆయుధాలు ఉండడం గమనార్హం. 26/11 ఘటన తర్వాత తేరుకున్న ప్రభుత్వం నగర భద్రత నిమిత్తం అనేక కీలక సంస్థల వద్ద ప్రత్యేకంగా బలగాలను నియమించింది. ఇందులో మెట్రో, మోనో, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, మహాలక్ష్మి మందిరం, ఓఎన్జీసీ, జేఎన్పీటీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఐఐటీ, ఐటీఐ తదితర 20 అత్యంత కీలక ప్రాంతాల్లో బందోబస్తును పటిష్టం చేశారు. అయితే ఆయా ప్రాంతాలు ఇప్పటికీ సురక్షితంగా లేవనే ఆశ్చర్యకరమైన విషయం ఓ దిన పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, ప్రార్థన స్థలాలు, విద్యా, వైద్య సంస్థల భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్ఎఫ్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘మహారాష్ట్ర భద్రత దళం’ ను 2011లో స్థాపించింది. ఈ దళంలో పనిచేసే జవాన్లకు పోలీసు అధికారులకు ఉన్న హోదా కల్పించింది. కాని ఈ దళం కోసం తీసుకున్న సుమారు 15 వందల జవాన్లలో కేవలం 577 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇందులో కేవలం 388 మందికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు, 189 మందికి లాఠీలు ఇచ్చారు. మిగతావారిని వెయిటింగ్లో పెట్టింది. ముంబై పోలీసు శాఖ చెత్త సామాగ్రి కింద జమకట్టిన మస్కెట్-410 మోడల్ బందూకులనే ఈ దళానికి ఇవ్వడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఒక్కోక్క జవానుకు ఒక తుపాకీ, ఐదు బులెట్లు ఇచ్చారు. ఇవి 1948 కాలం నాటివి కావడంతో పాడైపోయాయి. వాటి కి మేకులు కొట్టి సరిచేసి సెలోటేప్ అతికించి ఇచ్చారు. అవి భయపెట్టడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావని తెలుస్తోంది. కాగా ఏకే-47, ఏకే-56 లాంటి అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ఉగ్రవాదులను ఈ జవాన్లు ఎంతవరకు అడ్డుకుంటారనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.


