TSRTC Sleeper Buses: రోడ్డెక్కిన ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బస్సులు.. స్పెషల్‌ ఫీచర్స్‌ ఇవే..!

TSRTC launched AC Sleeper Buses with Free WiFi Check Features - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్‌ బస్సులను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం అత్యాధునిక హంగులతో కొత్త‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తదితరులు పాల్గొన్నారు.  వీరంతా కలిసి ల‌హ‌రి బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు. ఇటీవల 756 సూపర్‌ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, టీఎస్‌ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయనే గొప్ప నమ్మకాన్ని కూడగట్టుకుందని చెప్పారు. సంస్థను లాభాల బాటపట్టించేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలను చేస్తోందని, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌కు ధీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్ లైన్' పేరుతో ల‌హ‌రి ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింద‌ని, వీటిని ప్రజలు మంచిగా ఆదరించాలని కోరారు. త్వరలోనే ఎలక్ట్రిక్‌ బస్సులనూ సమకూర్చుకుంటుందన్నారు. టీఎస్‌ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువచేయడంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ చేస్తోన్న కృషిని అభినందించారు. అలాగే, పేదల కనీస ప్రయాణ అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణా వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు.
చదవండి: డబుల్‌ ఇంజన్‌ అంటే మోదీ-అదానీ: మంత్రి కేటీఆర్‌

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడుతూ.. తొలిసారిగా అందుబాటులోకి తెస్తోన్న ఏసీ స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉందన్నారు. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు ప్రతి పౌరుడు సహకరించి సంస్థను ఆదరించాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా రవాణా వ్యవస్థ ఉందనే విషయం మరచి పోవద్దన్నారు. 

సంస్థ ఎండీ వీ సజ్జనర్‌ మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం 630 సూపర్‌ లగ్జరీ బస్సులను, 130 డీలక్స్‌ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికోసం ఏసీ స్లీపర్‌ బస్సులను వాడకంలోకి తెస్తున్నామని వివరించారు. త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వాటిని ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.in లో బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. 

టెండర్‌ ద్వారా అశోక్‌ లేలాండ్‌ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్‌ బస్సులను తొలుత హైదరాబాద్‌ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్‌ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్‌ఈఎల్, ఎంజీబీఎస్‌ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్‌ కంటే ఈ బస్సుల్లో టికెట్‌ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది.

రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్‌ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్‌ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్‌ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్‌  చార్జింగ్‌ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్‌ బటన్, రేర్‌ వ్యూ కెమెరా, ఎల్‌ఈడీ సూచిక బోర్డులుంటాయి.  

ప్రారంభోత్సవ ఆఫర్‌..
ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్‌ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్‌ ధరలను తగ్గించనున్నారు.

డైనమిక్‌ ఫేర్‌ విధానం ప్రారంభం..
డైనమిక్‌ టికెట్‌ ఫేర్‌ విధానం కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభించింది  తొలిసారి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల తరహాలో డిమాండ్‌ ఆధారంగా టికెట్‌ ధరలను సవరిస్తారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్‌ ధర ఎక్కువగా, డిమాండ్‌ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు.

ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ డెవలపింగ్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్‌ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్‌ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top