సీఎం విజయ్‌కు హైకోర్టు నోటీసులు | Madras High Court Issues Fresh Notice To Tamil Nadu CM Vijay In Perambur Election Case | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌కు హైకోర్టు నోటీసులు

Jul 22 2026 8:05 AM | Updated on Jul 22 2026 10:32 AM

High Court issues notices to CM Vijay

సాక్షి, చైన్నై :  తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పెరంబూరు నియోజకవర్గం నుండి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు , ముఖ్యమంత్రి విజయ్‌ సాధించిన విజయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చెన్నై హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం విజయ్‌కు, అలాగే సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి మళ్లీ కొత్తగా నోటీసులు పంపించేందుకు నిర్ణయించారు. 

కేసు నేపథ్యం.. 
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం విజయ్‌ 1,20,365 ఓట్లు సాధించి, తన సమీప డీఎంకే  అభ్యర్థి ఆర్‌.డి. శేఖర్‌పై 53,715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి శేఖర్‌కు 66,650 ఓట్లు వచ్చాయి. అయితే, విజయ్‌ విజయాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని కోరుతూ డీఎంకే అభ్యర్థి ఆర్‌.డి. శేఖర్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన దినేష్‌, లక్ష్మి  నరసింహన్‌ అనే ఓటర్లు చెన్నై హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. 

పిటిషనర్ల ప్రధాన ఆరోపణలు 
డీఎంకే అభ్యర్థి ఆర్‌.డి. శేఖర్‌ తన పిటిషన్‌లో  విజయ్‌ తన నామినేషన్‌ పత్రాల్లో  పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని సమర్పించారని ఆరోపించారు. ఆయనకు ఉన్న ఆస్తులు, ఆయనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను సరైన రీతిలో వెల్లడించలేదని, కాబట్టి పెరంబూరులో ఆయన సాధించిన విజయాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ వి. లక్ష్మీనారాయణన్‌ సమక్షంలో మంగళవారం విచారణ జరిగింది. 

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది రిచర్డ్‌సన్‌ విల్సన్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఎం విజయ్‌తో పాటు ఎన్నికల అధికారులకు ఇదివరకు పంపిన కోర్టు నోటీసులు ఇంకా అందలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, సీఎం విజయ్, ఎన్నికల అధికారులకు కొత్తగా నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement