తమిళనాడు సీఎం విజయ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ వివాదాలు, విడుదల అడ్డంకులపై దర్శకుడు హెచ్. వినోద్ మంగళవారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కులం, మతం ఆధారంగా అబద్ధాలను సృష్టించి ప్రచారం చేయడంలో దేశం ముందంజలో ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
’ఎ’ సర్టిఫికెట్ వివాదం
ఈచిత్రానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ’ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం విచారకరమన్నారు. అయితే దీనిపై చట్టపరంగా పోరాడటానికి తమకు తగినంత సమయం లేదని, ప్రజలే ఈ సినిమాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
అబద్ధాల ప్రచారంపై ఆవేదన
‘‘అబద్ధాలను సృష్టించడంలో దేశం ముందుంది. కులం, మతం పేరుతో అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. ఒక చిన్న అబద్ధం మనిషిని మూర్ఖుడిగా మార్చగలదు. ఇలాంటి వాటిని అరికట్టడానికి బలమైన చట్టాలు అవసరం. కేవలం సెన్సార్ బోర్డు మాత్రమే ఈ సినిమాను అడ్డుకోలేకపోయింది.’’ అని వ్యాఖ్యలు చేశారు.
ఏ వ్యక్తినీ, పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదు
జననాయగన్ ద్వేషానికి వ్యతిరేకంగా, సమాజంలో ఐక్యత , మహిళల పురోగతిని ఆకాంక్షిస్తూ తీసిన చిత్రం. ఇందులో ఏ వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోలేదన్నారు.. విజయ్ కూడా ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని స్పష్టంగా చెప్పారని, ద్వేషానికి వ్యతిరేకంగా తీసిన సినిమాపై మళ్లీ ద్వేషాన్ని రుద్దడం సరికాదన్నారు. తన చివరి సినిమా ఎలా ఉండాలనే దానిపై విజయ్ కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు.
ఎన్నో కథలు విన్న తర్వాత ఆయన ఈ కథను ఎంచుకోవడానికి ప్రధాన కారణం సమాజం , మహిళా సాధికారతపై ఆయనకున్న తీవ్రమైన అభిరుచే అని వివరించారు. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం విజయ్‌కు కృతజ్ఞతులు అని పేర్కొంటూ, ఆయనపై ఎనలేని ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టంచేశారు. కాగా, విజయ్ నటించిన ఈ చిత్రం 23 వతేదీ గురువారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళనాడులో థియేటర్లలో వారం రోజుల పాటుగా అన్ని టికెట్లు బుక్కయ్యాయి.


