10 గంటల్లో 12 కోట్ల వ్యూస్‌.. సోషల్‌ మీడియాలో సీజేపీ సెన్సేషన్‌! | Cockroach Janta Party celebration reel goes viral | Sakshi
Sakshi News home page

10 గంటల్లో 12 కోట్ల వ్యూస్‌.. సోషల్‌ మీడియాలో సీజేపీ సెన్సేషన్‌!

Jul 26 2026 9:41 AM | Updated on Jul 26 2026 10:58 AM

Cockroach Janta Party celebration reel goes viral

న్యూఢిల్లీ: నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సోషల్‌ మీడియాలోనూ భారీ ఆదరణ పొందుతోంది. సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియో కేవలం 10 గంటల్లోనే 12 కోట్ల (120 మిలియన్‌) వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేస్తున్నారనే సమాచారం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దిప్కేకు ఫోన్‌లో అందిన క్షణాలను వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అది కాస్తా వైరలైంది. ఈ వీడియోకు వచ్చిన స్పందనతో సోషల్‌ మీడియాలో సీజేపీ ప్రభావం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది.

నీట్‌ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ ప్రారంభమైన  ఉద్యమం తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. రాయిటర్స్‌ కథనం ప్రకారం, సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు ఇప్పటికే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ముఖ్యంగా యువతతో అనుసంధానం కావడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ఈ ఉద్యమానికి ప్రధాన వేదికగా మారింది.

అయితే సోషల్‌ మీడియాలో వచ్చే వ్యూస్‌, లైక్‌లు ఉద్యమానికి ఉన్న రాజకీయ మద్దతును పూర్తిగా ప్రతిబింబించవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, భారత రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు సీజేపీ నాయకులు ఆసక్తికరంగా స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధి అశుతోష్‌ రంకా మాట్లాడుతూ భారత్‌లో దేనికీ 'నో' చెప్పకూడదు. ప్రస్తుతం మాత్రం మా దృష్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపైనే ఉంది అని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement