టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో నల్ల ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ముందు వరుసలో నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్న ఆ వ్యక్తిని చూసిన చాలామంది మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా కనిపించారని ఊహించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే కొద్ది గంటల్లోనే అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ముసుగు వెనుక ఉన్న వ్యక్తి మొజ్తబా ఖమేనీ కాదని, అలీ ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలు కావడం వల్లే ఆయన ముఖాన్ని ముసుగుతో కప్పుకున్నట్టు సమాచారం. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది.
ఆ ముసుగు మనిషి ముందు వరుసలో నిలబడి అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన బేస్‌బాల్ టోపీ ధరించి, ముఖాన్ని నల్ల ముసుగుతో కప్పుకున్నారు. అయితే, ఆయన మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించడంతో ఆయన ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
జవాద్ ఖమేనీకి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించారు. మొజ్తబా ఖమేనీ ముఖం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు అమెరికా నిఘా నివేదికలు తెలిపాయి.
మొహమ్మద్ జవాద్ ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొస్తఫా ఖమేనీ. మొస్తఫా కుమారుడే మొహమ్మద్ జవాద్ ఖమేనీ. మొస్తఫా ఖమేనీ సుమారు 1965లో జన్మించినట్టు అక్కడి మీడియా తెలిపింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు గురువారం జరిగాయి. 6 రోజుల పాటు సాగిన కార్యక్రమంలో 43 మిలియన్ల మంది పాల్గొన్నట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా, మొజ్తబా ఖమేనీ శనివారం టెలిగ్రామ్‌లో లిఖితపూర్వక సందేశం విడుదల చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని అందులో పేర్కొన్నారు.


