చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షిస్తాం
అమాయకుల ప్రాణాలు బలిగొన్న ముష్కరులకు గుణపాఠం తథ్యం
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
ఢిల్లీ బాంబు పేలుడులో మరణాల పట్ల దిగ్భ్రాంతి
భూటాన్ మాజీ రాజు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మోదీ
బాంబు పేలుడు బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు
థింపూ: ఢిల్లీ కారు బాంబు పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని అన్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ప్రధాని మోదీ మంగళవారం భూటాన్‌లో పర్యటించారు. భూటాన్ మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
రాజధాని థింపూలోని చాంగ్లీమేథాంగ్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారమైన హృదయంతో థింపూ సిటీకి వచ్చానని చెప్పారు. ఢిల్లీ పేలుడు ఘటనలో సాధారణ ప్రజలు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోగలనని అన్నారు. ఆప్తులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయారని చెప్పారు. దేశం మొత్తం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రంతా దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. పేలుడు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నారని వివరించారు. సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని వెల్లడించారు. కుట్రదారులను శిక్షించడం తథ్యమని పునరుద్ఘాటించారు.
రాజ్యాంగ ప్రజాస్వామిక రాచరికం
భారత్, భూటాన్ మధ్య శతాబ్దాలుగా బలమైన ఆధ్యాతి్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ జన్మదినోత్సవంలో పాల్గొనడం తన విధి అని వ్యాఖ్యానించారు. భారతీయుల తరఫున మాజీ రాజుకు, భూటాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భూటాన్ అత్యాధునిక దేశంగా ఎదుగుతోందని ప్రశంసించారు. ఇక్కడ రాజ్యాంగ ప్రజాస్వామిక రాచరికం ఉందని అన్నారు. దేశంలో గ్రాస్ నేషనల్ హ్యాపినెస్ అనే వినూత్న విధానం ప్రవేశపెట్టారని కొనియాడారు.
జ్ఞానం, నిరాడంబరత, ధైర్యం, నిస్వార్థ సేవ అనే లక్షణాల కలబోతే భూటాన్ రాజు అని శ్లాఘించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నెలకొల్పడంలో, సరిహద్దుల్లో శాంతిని కాపాడడంలో ఆయన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీ బాంబు పేలుడు బాధితుల కోసం చాంగ్లీమేథాంగ్ స్టేడియంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్‌గేల్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది భూటాన్ ప్రజలు హాజరయ్యారు. బాధిత కుటుంబాలకు భూటాన్ పాలకులు సంతాపం ప్రకటించారు. సానుభూతి వ్యక్తంచేశారు.
భూటాన్‌కు రూ.4,000 కోట్ల రుణం
భూటాన్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.4,000 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలకు ఇంధన సహకారమే మూలస్తంభమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భూటాన్ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్ అందిస్తున్న సహకారాన్ని రాజు వాంగ్‌చుక్ ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ–ఔషధాలు, మానసిక ఆరోగ్య సేవల రంగంలో సహకారానికి భారత్, భూటాన్ మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.
భూటాన్‌లోని గెలెఫూ, సామ్‌త్సేలను భారత్‌తో రైలు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబోతున్నామని మోదీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భూటాన్ పారిశ్రామికవేత్తలు, రైతులకు భారత మార్కెట్లు సులువుగా అందుబాటులోకి వస్తాయన్నారు. రెండు దేశాలు కేవలం సరిహద్దులతోనే కాకుండా సంస్కృతులతో అనుసంధానం అవుతున్నాయని గుర్తుచేశారు.
భూటాన్ రాజుతో మోదీ భేటీ
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారత్, భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇంధనం, అనుసంధానం, టెక్నాలజీ, రక్షణ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సైతం జరిగాయి. అనంతరం 1,020 మెగావాట్ల పునత్సాంగ్‌చు–2 హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును మోదీ, వాంగ్‌చుక్ ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును భారత్, భూటాన్ ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రెండు దేశాలూ పంచుకుంటాయి. భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో తాము భాగస్వామి కావడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు.


