న్యూఢిల్లీ: భారత్- హిమాలయ దేశం భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11, 12 తేదీలలో రెండు రోజుల పాటు భూటాన్‌లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్‌చుక్‌ను కలుసుకుంటారు. ఇద్దరు నేతలు సంయుక్తంగా భారత్- భూటాన్ మధ్య నిర్మించిన 1020 ఎండబ్ల్యూ పునత్‌సంగ్‌చు -II జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన భూటాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రస్తుత చక్రవర్తి తండ్రి, నాల్గవ రాజు జిగ్మే సింగే వాంగ్‌చుక్ 70వ జయంతి కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో చర్చలు జరపనున్నారు. థింఫులోని తాషిచోడ్జోంగ్‌లోని బుద్ధుని పవిత్ర అవశేషాల వద్ద ప్రధాని మోదీ ప్రార్థనలు చేయనున్నారు. అలాగే భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో పాల్గొననున్నారు.
ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి, పరస్పర ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాగా భారతదేశానికి చెందిన పలువురు ఆధ్యాత్మిక గురువులు భూటాన్‌లో పర్యటించి, అక్కడ స్థిరపడ్డారు. కాగా ప్రధాని మోదీ దీనికిముందు 2024, మార్చిలో భూటాన్‌ను సందర్శించారు. అప్పుడు భూటాన్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పోను అందుకున్నారు.
ఇది కూడా చదవండి: ‘పంజాబ్ సర్వ నాశనం’: సీఎం సంచలన వ్యాఖలు


