న్యూజిలాండ్ మార్కెట్లోకి పోటెత్తనున్న భారతీయ ఉత్పత్తులు
వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న ద్వైపాక్షిక వాణిజ్యం
భారతీయ విద్యార్థులకు దీర్ఘకాలిక వర్క్ వీసాలు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేర్చే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారుచేసుకున్నాయి. సంబంధిత చర్చలు విజయవంతంగా ముగిశాయని ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌లు ఫోన్‌లో సంభాషించి ఒప్పందాన్ని ఖరారుచేశారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో ఇరుదేశాలు ఉమ్మడిగా ముందుకుసాగనున్నాయి. న్యూజిలాండ్ నుంచి ఉన్ని, బొగ్గు, కలప మొదలు వైన్, అవకాడో, బ్లూబెర్రీల దాకా పలు రకాల ఉత్పత్తులపై 95 శాతం టారిఫ్‌ను భారత్ తొలగించనుంది. దీంతో ఇవన్నీ సరసమైన ధరలకు భారతీయులకు అందుబాటులోకి వచ్చే వీలుంది.
భారతీయ ఎగుమతిదారుల నుంచి పాల ఉత్పత్తులు, ఉల్లి, చక్కెర, మసాలా దినుసులు, వంటనూనెలు, రబ్బర్‌దాకా పలు రకాల ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లోకి ఎగుమతిచేసి లాభాలను కళ్లజూడనున్నారు. తయారీ, మౌలికరంగం, సేవలు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనా రంగాల్లో వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఆపిల్ ఎగుమతులపై టారిఫ్ ప్రయోజనాలు పొందనుంది.
ఇరుదేశాల మధ్య పటిష్టమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతోపాటు రెండు దేశాల మార్కెట్లలోకి సరు కుల అనుమతి, నూతన పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యూహాత్మక భాగస్వామాన్ని బలపర్చుకోవడం, ఆవిష్కర్తలు, నూతన పరిశ్రమల స్థాపన సహా రైతులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థులు, యువత ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ పాడిరైతుల ప్రయోజనాలను కాపాడుతూ న్యూజిలాండ్ పాలు, పెరుగు, వెన్న, చీజ్ తదితర ఉత్పత్తులపై టారిఫ్‌లను యథాతథంగా కొనసాగించనున్నారు. కృత్రిమ తేనె, ఆయుధాలు, మొక్కజొన్న, బాదం, వజ్రా భరణాలు, కాపర్, అల్యూమినియం ఉత్పత్తులపై గతంలో మాదిరే భారత్ టారిఫ్ విధించనుంది.
వేల మంది భారతీయులకు ప్రయోజనం
న్యూజిలాండ్‌లోని నైపుణ్య ఉద్యోగాల్లోకి ఏటా 5,000 మంది భారతీయ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలను ఇచ్చేందుకు న్యూజిలాండ్ అంగీకారం తెలిపింది. దీంతో ఆయుష్ వైద్యులు, యోగా నిపుణులు, పాకశాస్త్ర ప్రవీణులు, సంగీతం, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్యసంరక్షణ, విద్య, నిర్మాణ రంగాల్లో భారతీయులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
భారతీయ విద్యార్థులు న్యూజిలాండ్‌లో చదువుకునేకాలంలో గరిష్టంగా వారానికి 20 గంటలపాటు పనిచేసుకునేందుకు అనుమతిస్తారు. డిగ్రీ కోర్సు అయితే రెండేళ్ల వర్క్ వీసా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఆనర్స్) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మెడిసిన్(స్టెమ్) గ్రాడ్యుయేట్ అయితే మూడేళ్ల వర్క్ వీసా, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అయితే నాలుగేళ్ల వర్క్ వీసా ఇస్తారు. ఈ ఏడాది మార్చినెలలో భారత్‌లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ పర్యటించిన కాలంలోనే ఈ ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
భారత్‌లో కివీపండు, ఆపిల్, తేనె దిగుబడి పెంపే లక్ష్యంగా ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా సాగు–సాంకేతికత చర్యా ప్రణాళికను రూపొందించనుంది. భారతీయ వైన్స్, స్పిరిట్‌లను న్యూజిలాండ్‌లోనూ రిజిస్ట్రేషన్ చేసే అక్కడి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ సంబంధ చట్టాలకు సవరణలు చేయనుంది. ఆయుష్, సంస్కృతి, మత్స్య, శ్రవణ దృశ్య పర్యాటకం, అటవీ, ఉద్యానవనాలతోపాటు వైద్యం, వ్యవసాయం వంటి సంప్రదాయ జ్ఞానపరంపరలోనూ సహకార దృక్పథంతో ముందుకుసాగుతాం’’ అని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘చర్చలు కేవలం 9 నెలల్లోనే ఒప్పందం ఖరారు స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది ఇరుదేశాల ప్రభుత్వాల పరిపాలనా సంకల్పానికి ప్రతీక’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు.


