
పక్షుల కువకువలే తప్ప హారన్ మోతలు లేవు, ఎటు చూసినా పచ్చని చెట్లు, పంటపొలాలే తప్ప. ఎత్తైన భవనాలు లేవు. అలారం మోతతోనో మొబైల్‌ఫోన్ కాల్‌తోనో కాకుండా నులివెచ్చని సూర్యకిరణాలు తట్టిలేపుతున్నాయి. బ్రేక్ మీద నుంచి కాలు తీయలేని ట్రాఫిక్ జామ్‌లు లేవు, కాలినడకతో ఎంతదూరం వెళ్లినా అడుగులకు బ్రేక్ వేయాల్సిన పనిలేదు. ఎండ, వాన, చలికాలాలను అచ్చంగా ఆస్వాదించవచ్చు.
నీల్, మోమోలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన స్వప్నిల్ రావు, మృణ్మయీ దేశ్‌పాండేల జీవితం ఇది. వాళ్లు ఐదేళ్ల కిందట మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండల్లోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ కొంత బంజరు నేలను కొని సాగు చేశారు. గొప్ప ఇంజినీరింగ్ స్కిల్‌తో ఇంటిని నిర్మించుకున్నారు. నగరంలో పుట్టి పెరిగిన వాళ్లకు గ్రామం ఎలా ఉంటుందో తెలియదు. సినిమాల్లో చూడడం తప్ప గ్రామాన్ని, గ్రామీణ జీవితాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయలేరు. ముంబయి దంపతులు నగరాన్ని వదిలి కొండకోనల్లోని ఓ కుగ్రామానికి వెళ్లి అక్కడే నివసిస్తున్నారు.
అది కూడా పర్యావరణ హితంగా. స్థానికంగా దొరికే ల్యాటరైట్ ఇటుకలతో ఇద్దరూ ఇటుక ఇటుక పేర్చి ఇంటిని నిర్మించుకున్నారు. బంజరు భూమిని చదును చేసి సాగులోకి తెచ్చి స్వయంగా మొక్కలు నాటి పంటలు పండిస్తున్నారు. జీరో వేస్ట్ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తున్నారు. ఇది నీల్, మోమో దంపతుల అచీవ్‌మెంట్.
ఎకోఫ్రెండ్లీ జీవితం స్వప్నిల్, మృణ్మయిలు సిటీ బిజీ జీవితంలో అలసిపోయారు. జీవితం ఇంకోలా ఉంటే బావుణ్ణనుకున్నారు. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు వాళ్లు ములుసార్ గ్రామంలో జీవిస్తున్న ఎకోఫెండ్లీ జీవితం. 2020 నుంచి అక్కడే జీవిస్తూ పొలాన్ని సాగు చేసి రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు.
ఆ ఉత్పత్తులతో నగరానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. నీల్ అండ్ మోమో పేరుతో పర్యావరణహితమైన సబ్బులు, షాంపూలు ఇతర ఉత్పత్తుల పరిశ్రమ నిర్వహిస్తున్నారు. మదర్ ఎర్త్‌ని కాపాడుకోవడం నగర జీవితంలో సాధ్యం కావడం లేదు. ప్రకృతితో కలిసి జీవిస్తూ నగరాల్లో ఉండే వారికి పర్యారణహితమైన ఉత్పత్తులను చేరుస్తున్నారీ దంపతులు.
(చదవండి: దటీజ్ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..!)