ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.
అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.
వసంతాన్ని ఆహ్వానిస్తూ..
ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.
ప్రధాని ప్రశంస
ఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.
The stage is all set, the performers are pumped up.#BagurumbaDwhou - just a few hours to go! pic.twitter.com/PfSiC6CQLy
— Himanta Biswa Sarma (@himantabiswa) January 17, 2026
(Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!)


