బాబు పాలనలో దివ్యాంగులకు పెన్షన్ టెన్షన్
పింఛన్లకు కోత పెట్టేందుకు రీ–వెరిఫికేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీకి చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం
మొక్కుబడిగా సదరం స్క్రీనింగ్ క్యాంప్‌లు
స్లాట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల డిమాండ్
బాబు సర్కారు నిర్వాకంతో దివ్యాంగుల దోపిడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస కనికరం కూడా లేదు. వారి పింఛన్లకు కోత పెట్టి వారి బతుకులను కకావికలం చేయడానికి రీ వెరిఫికేషన్ పేరుతో నానా అగచాట్లకు గురిచేస్తోంది. అరకొర సదరం శిబిరాలతో ముప్పుతిప్పులు పెడుతోంది. ఫలితంగా వైకల్య ధ్రువీకరణ కోసం సదరం స్లాట్ పొందేందుకు దివ్యాంగులు, వివిధ జబ్బులతో బాధపడుతున్న వారు అవస్థలకు గురవుతున్నారు.
సామాజిక భద్రతా పింఛన్లలో కోత పెట్టేందుకు బాబు సర్కారు రీ–వెరిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో గతేడాది నుంచి వైద్య శాఖ సదరం రీ–వెరిఫికేషన్‌లో నిమగ్నమైంది. కొత్తగా వైకల్య ధ్రువీకరణ కోసం వారంలో ఒకరోజు మాత్రమే సదరం క్యాంపులను మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో సదరం స్లాట్‌లకు భారీ డిమాండ్ ఉంటోంది.
ఇటీవల నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 30 వేల స్లాట్‌లను ఈ నెల 14న వైద్య శాఖ విడుదల చేసింది. స్లాట్‌లన్నీ రెండు రోజుల్లోనే బుక్ అయిపోయాయి. మరో 13 వేల మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. స్లాట్‌లకు ఉన్న డిమాండ్‌ను ఆసరా చేసుకుని కొందరు మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, దళారులు దివ్యాంగులను దోపిడీ చేస్తున్నారు.
సదరంపై నీలినీడలు
2019కి ముందు వరకూ చంద్రబాబు పాలనలో కేవలం 56 ఆస్పత్రుల్లోనే సదరం స్క్రీనింగ్స్ నిర్వహించేవారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు పడుతున్న అవస్థలకు చెక్‌పెడుతూ అదనంగా మరో 117 ఆస్పత్రులను కలిపి 173 చోట్ల సదరం క్యాంపులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఆస్పత్రులోనైనా స్లాట్ బుక్ చేసుకుని అసెస్‌మెంట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించారు. దీంతో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైకల్య ధ్రువీకరణ ప్రక్రియ ఎంతో సులభతరం అయింది.
గత ఏడాది చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడంతో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది జూన్‌లో ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పింఛన్ల ఏరివేతలో భాగంగా రీ–వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. దివ్యాంగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో మొక్కుబడిగా స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
వారంలో ఒకరోజు (ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో ఒక్కో రోజు) మాత్రమే సదరం క్యాంప్‌లను నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ నిర్వహించే ఆస్పత్రులను సైతం 173 నుంచి 118కి కుదించారు. అటు స్లాట్‌లు, ఇటు ఆస్పత్రుల సంఖ్య కూడా తగ్గడంతో ఒక్కసారిగా డిమాండ్ ఎక్కువైంది.
రూ.10 వేలు ఇవ్వాల్సిందే
ప్రభుత్వం విడుదల చేస్తున్న చాలీచాలని స్లాట్‌లను కొందరు మీ–సేవ నిర్వాహకులు గంటల్లోనే బ్లాక్ చేసేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్క జిల్లాల్లో స్లాట్‌లు బుక్ చేసి, అనంతరం దివ్యాంగుల సొంత జిల్లాలకు స్లాట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో పెద్దఎత్తున దందా నడుస్తోంది. ఇలా దివ్యాంగుల నుంచి మీ–సేవ నిర్వాహకులు, దళారులు రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు.
అనంతపురం, కర్నూలు, తిరుపతి, గుంటూరు, కృష్ణా ఇలా రాష్ట్రంలో ప్రతిచోటా దళారుల దోపిడీ కొనసాగుతోంది. దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దంటూ ప్రభుత్వం ప్రకటనలతోనే సరిపెడుతోంది. ప్రభుత్వం ఆస్పత్రులు, క్యాంప్‌లను పెంచితేనే దోపిడీకి అడ్డుకట్టపడుతుందని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


