వైఎస్ జగన్ ఎదుట ఓ విద్యార్థిని ఆవేదన
సాక్షి కడప: చంద్రబాబు తీరు వల్లే తాను మెడికల్ సీటు కోల్పోయానని విద్యార్థిని పూజిత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. బుధవారం పులివెందులకు చెందిన నాగసుందరరెడ్డి, ఆయన కుమార్తె పూజితలు వెలమవారిపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్‌ను కలిశారు. నీట్‌లో తన కుమార్తెకు 467 మార్కులు వచ్చాయని, రెండు మూడు మార్కుల తేడాతో తన కుమార్తె మెడికల్ సీట్ కోల్పోయిందని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమార్తెలాగా అనేక మంది వైద్య విద్య కోసం కష్టపడి చదివినా, బాబు తీరు వల్ల ఫలితం పొందలేకపోయా రన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు.
ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే పూజిత లాంటి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లయ్యేవారన్నారు. తమ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.


