భార్య ఫిర్యాదుతో రోడ్డుపై భర్త నిరసన
● రాజంపేట పీఎస్ ఎదుట హంగామా
● ఆర్టీసీ బస్సు కిందపడే యత్నం
● భర్త వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు
చేసిన భార్య
రాజంపేట : తన భార్య తనపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో.. ఆమె భర్త రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట హంగామా చేసిన సంఘటన రాజంపేట అర్బన్ పోలీసుస్టేషన్ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన అఖిల్, పుల్లంపేటకు చెందిన రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కొన్నాళ్లు నివసించారు. వీరికి ఇద్దరు సంతానం. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మొలకలచెరువులో కొంత కాలం కలిసి ఉన్నారు. కొన్ని రోజుల కిందట రాధిక రాజంపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే భార్య కనిపించడం లేదని మొలకలచెరువులో భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐ నాగార్జున విచారణ చేపట్టారు. సీఐ నాగార్జునపై అఖిల్ ఆరోపణలు చేస్తూ, రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కింద పడేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఐ నాగార్జున మాట్లాడుతూ అఖిల్‌కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. పోలీసులపై అఖిల్ వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేశామన్నారు.
ఎస్పీకి ఫిర్యాదు చేశానంటున్న భార్య
భర్త, అత్త, మామపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో.. వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారని అఖిల్ భార్య రాధిక మీడియాకు తెలిపింది. తన భర్త తనను కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని, ప్రతి నెల తన ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు. రాకుంటే ఇకపై ఒకటే మానసికంగా వేధింపులు పెడతారన్నారు. పెళ్లయినప్పటి నుంచి మెంటల్ రీతిలో తనపై చావబాదేవాడన్నారు. రాయచోటికి వెళ్లి ఎస్పీకి తన భర్త శాడిజంపై ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. తాను కనిపించకుండా పోలేదని, మా అమ్మమ్మ ఇంటికి వచ్చానని తెలిపారు. మొలకలచెరువులో తాను కనిపించలేదని, తప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. తన భర్తతో వివాహమైనప్పటి నుంచి నేటి వరకు తనకు జరిగిన సంఘటనలను ఆమె వివరించింది.
భార్య ఫిర్యాదుతో రోడ్డుపై భర్త నిరసన


