బండి కాదు.. మొండి ఇది!
● ఆగిన ఆర్టీసీ బస్సు
● ప్రయాణికులకు తిప్పలు
పులివెందుల రూరల్ : ఆర్టీసీ బస్సు అర్ధరాత్రి సమయంలో మార్గంమధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పులివెందుల ప్రాంతంలోని పలువురు తమ పిల్లలను విజయవాడలో చదివిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో వారు తమ సొంత గ్రామాలకు వచ్చేందుకు శనివారం విజయవాడ నుంచి పులివెందుల డిపోకు చెందిన పులివెందులకు వస్తున్న బస్సులో ఎక్కారు. మార్కాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో క్లచ్ సెల్ఫ్ సమస్యతో రాత్రి 1 గంట ప్రాంతంలో బస్సు ఆగి పోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలికి జాగారం చేయాల్సి వచ్చింది. ప్రయాణికులతో బస్సు తోయించి మార్కాపురానికి రావడంతో అక్కడ కూడా రెండవ సారి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు చలిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయిన పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు. పులివెందుల డిపో అధికారులకు సమాచారం తెలియజేస్తే.. మార్కాపురం డిపో నుంచి బస్సు ఏర్పాటు చేస్తామని అర్ధ గంట సమయం పడుతుందని అన్నారన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలు అవుతున్నా తమ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పులివెందుల డిపో అధికారులు కాలం చెల్లిన బస్సులను తొలగించి, కండీషన్‌లో ఉన్న వాటిని నడపాలని వారు కోరుతున్నారు.


