ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!
నియంత్రణ శూన్యం
కడప కోటిరెడ్డిసర్కిల్: సంక్రాంతి వచ్చిందంటే చాలు పండగంతా ప్రైవేటు ట్రావెల్స్‌దే. సీజన్‌లో దొరికిందే తడవుగా చార్జీల పేరుతో ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దీంతో పండుగ ప్రయాణాలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లలో రెండు నెలల ముందే రిజర్వేషన్లు ముగియడం, ఆర్టీసీ సైతం అవసరానికి తగినన్ని బస్సులు నడపకపోవడంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక్కో ట్రావెల్స్ నిర్వాహకులు ఒక్కో విధంగా ప్రయాణికుల దోపిడీయే లక్ష్యంగా టికెట్ ధర నిర్ణయించారు. సాధారణ టిక్కెట్టు ధర కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా టిక్కెట్ రేట్లను పెంచేశాయి. పెరిగిన ధరలతో బేజారెత్తిపోతున్న జనం కళ్లల్లో సంక్రాంతి కాంతి కళా విహీనంగా కనిపిస్తోంది.
అధిక వసూళ్లు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు రావాలనుకునే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధి, చదువుల కోసం హైదరాబాదు, విజయవాడ, చైన్నె, బెంగుళూరులో ఉంటున్న జిల్లా వాసు లు పండక్కి ఇంటికి రావాలంటే భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న వారంతా రైళ్లకు బుకింగ్ చేసుకున్నారు. సెలవు దొరుకుతుందో లేదో అని వెయిట్ చేసి చివరి నిమిషంలో ప్రయాణానికి సిద్దమైన వారి పరిస్థితి దారుణంగా ఉంది. రైళ్లు, ఆర్టీసీ బస్సులు సీటు లేని పరిస్థితి వర్ణణాతీతంగా మారింది.
రైళ్లలో అడుగు పెట్టలేని పరిస్థితి
ఇక రైలు ప్రయాణం గురించి ఆలోచన మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు వివిధ నగరాల నుంచి వచ్చే రైళ్లకు సంబంధించి రెండు నెలల ముందే రిజర్వేషన్లు క్లోజ్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్టు కూడా దొరకడం లేదు. పోనిలే జనరల్ బోగీల్లో వద్దామనుకుంటే అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణం ఆలోచనలను విరమించుకోవాల్సి వస్తోంది.
విమాన చార్జీల కన్నా అదనం
సాధారణంగా కడప నుంచి హైదరాబాదు, విజయవాడలకు విమాన సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం పండుగ సందర్భంగా వసూలు చేస్తున్న చార్జీలతో పోలిస్తే విమాన ఛార్జీలే తక్కువగా ఉన్నాయి. ఏకంగా విజయవాడకు రూ. 5 వేలకు పైగా వసూలు చేయడం దారుణం. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ చార్జీలు నిర్ణయించలేదని, అధికారుల పర్యవేక్షణ లేకపోడంతో ఈ దోపిడీ పర్వం కొనసాగుతోందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక వసూళ్లపై చర్యలు తీసుకోవాలి
తెలుగువారు సంక్రాంతిని పెద్ద పండుగుగా భావిస్తారు. వివిధ కారణాలతో దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఒక్కచోటచేరాలని భావిస్తారు. దీనిని ప్రైవేటు యాజమాన్యాలు అవకాశంగా తీసుకోవడం సరికాదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలను నిర్ణయించి వసూలు చేస్తున్నాయి. – శివ వీరనాల, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్‌ఐ, కడప
సంక్రాంతి ప్రయాణం భారం
సంక్రాంతి ప్రయాణం భారంగా మారింది. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలని విజయవాడకు వెళ్లాలని అనుకుంటే ఏకంగా రూ. 5 వేలు చార్జీ అని తెలిపారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ వారిని సంప్రదిస్తే చార్జీలు భరించలేనివిగా ఉన్నాయి. – దూపం రాజు. కడప
ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
పండుగ సందర్బంగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు పెద్దమొత్తంలో ఛార్జీలు వసూలు చేయడం తగదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. పండుగకు సొంతూళ్లకు ప్రయాణించాలంటే తలకుమించిన భారమవుతుంది. పండుగేమో కానీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల దోపిడీ భరించలేకున్నాం. – శాంతమ్మ, కడప
బస్సులు, రైళ్లలో ఖాళీలేక ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న జనం
అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
హైదరాబాదు, విజయవాడ నుంచి రావాలంటే పెద్ద మొత్తంలో వసూలు
దోపిడీపై పట్టీపట్టనట్లు వ్యవహరించిన కూటమి సర్కార్
హైదరాబాదు 1100 3000
విజయవాడ 1000 5490
బెంగుళూరు 700 2000
చైన్నె 600 1500
ట్రావెల్స్ యాజమాన్యాలు చార్జీలను మూడింతలు పెంచి వసూలు చేస్తున్నా చర్యలు తీసుకునే నాథుడే లేడు. చార్జీల నియంత్రణలకు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవడానికి కనీసం ప్రయత్నించడం లేదు. తప్ప నిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పుడే ఇంత భారం ఉంటే తిరుగు ప్రయాణంలో ఇంకెంత బాదుడు ఉంటుందోనన్న ఆందోళనల ప్రయాణికుల్లో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల ఆటలు కొనసాగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!
ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!
ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!
ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!
ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!
ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగ!


