రామయ్య సన్నిధిలో మంత్రి
ఒంటిమిట్ట: ప్రముఖ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ..ఒంటిమిట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు రైతులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ అలసత్వం వహించడంతో తొండూరు తహసీల్దార్ రామచంద్రుడును సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, వీఎన్ పల్లె, గో పవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, బి.మఠం, ప్రొద్దుటూరు, సీకే దిన్నెమండల తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్లు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని గమనించకుండా, సరైన రీతిలో పర్యవేక్షించని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్, పులివెందుల రెవెన్యూ డివిజన్ అధికారి చిన్నయ్యలకు మెమోలు జారీ చేశారు.
ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్‌లో ధర్మవరం–మచిలీపట్నం రైలుకు స్టాపింగ్ సౌకర్యం కల్పించడంతో ఆదివారం స్థానిక ప్రజలు ఈ రైలుకు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉద యం స్థానిక స్టేషన్లో తొలిసారి ఆగింది. దీంతో మండలంలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యార్థులు, ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో ఆగిన రైలును మామిడాకులు,పూలదండలతో అలంకరించారు. ఈ సందర్భంగా రైలు లోకో పైలెట్‌లకు సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ముద్దనూరులో రైలు స్టాపింగ్‌కు కృషిచేసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మండలఅధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


