వడ్డే ఓబన్న జీవితం.. స్ఫూర్తిదాయకం
కడప సెవెన్‌రోడ్స్ : తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జి జేసీ మాట్లాడుతూ ప్రజల స్వేచ్ఛా జీవనాన్ని కోరుతూ బ్రిటీష్ పాలనను అంతమొందించేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన దేశ భక్తుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఆ మహానీయుని జన్మదినోత్సవాన్ని రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య తెలిపారు. ఆర్‌ఐలు శివరాముడు, శ్రీశైలరెడ్డి, సోమశేఖర్ నాయక్, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


