తల్లీకూతుళ్లు అదృశ్యం
వేంపల్లె : స్థానిక చింతల మడుగుపల్లె రహదారిలో ఉన్న శ్మశాన వాటిక సమీపంలో నివసిస్తున్న తల్లీకూతుళ్లు ఆదివారం అదృశ్యమయ్యారు. ఈ మేరకు బాధితుడు రమేష్ ఆదివారం వేంపల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే.. చింతల మడుగుపల్లె రహదారిలో ఉన్న శ్మశాన వాటిక సమీపంలో రమేష్, అశ్విని(24) దంపతులు జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదు సంవత్సరాల కూతురు దీప్తి ఉంది. రమేష్ గల్ఫ్‌లో పని చేస్తున్నాడు. ఇటీవలే గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆయన తల్లి సరోజమ్మ అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు సేవలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో కుమార్తెను తీసుకుని అశ్విని ఇంటి వెళ్లిపోయింది. రమేష్ చుట్టుపక్కల వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
15న ఆకాశవాణిలో
సంక్రాంతి కవి సమ్మేళనం
కడప సెవెన్‌రోడ్స్ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 15వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు ఆకాశవాణి కడప కేంద్రం సంక్రాంతి కవి సమ్మేళనం ప్రసారం చేయనున్నట్లు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ చుండూరి మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ కవులు ఎం.ఎం.వినోదిని, డాక్టర్ ఎన్.ఈశ్వరరెడ్డి, డాక్టర్ జి.వి.సాయిప్రసాద్, లోకా జగన్నాథ శాస్త్రి, సుంకోజి దేవేంద్రాచారి, యలమర్తి మధుసూదన్, చెన్నా రామమూర్తి తదితరులు సంక్రాంతి లక్ష్మి కి స్వాగతం పలుకుతూ కవితా గానం చేశారన్నారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చని పేర్కొన్నారు.
బతుకు దెరువు కోసం వెళ్లి..
లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లిలోని కుర్నూతుల స్టేట్ బ్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న జటిపిటి మధుకర్ (38) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం కూలి పనికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పని చేస్తుండగా శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. ఆదివారం మధుకర్ మృతదేహం స్వగ్రామమైన లక్కిరెడ్డిపల్లికి చేరుకోవడంతో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మధుకర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించే మధుకర్ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పనిలో ఉండగానే గుండెపోటుకు గురై ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆదివారం మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లికి చేర్చారు. బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.


