మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోలు దగ్ధం చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : సామాన్యులకు వైద్య విద్యను దూరం చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీఓ 590, 107 108 ప్రతులను ఈ నెల 14న భోగి మంటల్లో దగ్ధం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం నూతన వైద్య కళాశాలల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నంబర్ 590ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇది కేవలం వైద్య విద్య వెనుక ఉన్న సామాజిక లక్ష్యాన్ని కాకుండా, ఆ విద్యకు అనుబంధమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేద ప్రజల వైద్య సేవలకు కూడా దూరం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలోని స్థిరమైన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకి అందకుండా పోతాయన్నారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశించడం జరిగిందన్నారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, మద్దిలేటి, శంకర్ నాయక్, పిడుగు మస్తాన్, కే మునయ్య తదితరులు పాల్గొన్నారు.


