వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో అరటి రైతుల సమస్యలు వింటున్న వైఎస్ జగన్
దళారులతో కుమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టికొడుతున్నారు
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
మా హయాంలో టన్ను అరటి రూ.25 వేల నుంచి రూ.32 వేల వరకు అమ్ముకోగలిగారు
అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా ఎగుమతి చేశాం
ఇప్పుడు రూ.2 వేలకు కూడా కొనేవారు కరువయ్యారు..
పెట్టుబడి సాయం రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చి.. రూ.30 వేలు ఎగ్గొట్టారు
ఉచిత పంటల బీమా హుష్ కాకి
ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 1,100 కోట్లు ఎగ్గొట్టారు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
ఉల్లి క్వింటా రూ.1,200తో కొంటామన్నారు.. ఎక్కడ కొన్నారు?
ప్రజలకు, రైతులకు నష్టం జరుగుతోందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10 వేల మంది రైతులతో ఫోన్‌లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తాం అంటాడు. కానీ, ఏదీ చేయడు. క్వింటా ఉల్లి రూ.1,200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు ఇస్తా మన్నారు.
అదీ లేదు. ఇదీ లేదు.. ఏదీ లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు. దాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్టాండ్ అన్నట్లు తయారైంది.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి కడప: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, అరటి రైతుల పరిస్థితి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయ రంగం అన్నా ప్రేమ లేదని.. ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినా కనీస సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం ఆయన పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, తోటల్లో అలాగే వదిలేస్తున్నామని, పశువులకు వేస్తున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని వాపోయారు. రైతుల బాధలు ఓపికగా విన్న వైఎస్ జగన్.. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
కరెంటు ఖర్చవుతుందని వినియోగంలోకి తీసుకు రారా?
⇒ఈ ప్రాంతంలో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్‌ను 2024 మార్చిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలైంది. కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజ్‌ను నడపడం లేదు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? చంద్రబాబు రైతులను ఏ విధంగా పట్టించుకుంటున్నాడో చెప్పేందుకు ఈ కోల్డ్ స్టోరేజీయే నిదర్శనం.

వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇒చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, వ్యవసాయ రంగం పరిస్థితి తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది గుండు సున్నా.
⇒మొన్నటి మోంథా తుపాను నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1,100 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతుల హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు.
⇒రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు.. వారికి అగచాట్లు రాకూడదని తపన పడిన ప్రభుత్వం మాది. మా ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి 84 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం. ఆ విధంగా దాదాపు రూ.7,400 కోట్లు అందించాం. ఈ రోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉంది.
⇒మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. ఏ ఏడాది కూడా ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబు రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టాడు.
నాడు రూ.32 వేలు.. నేడు రూ.2 వేలు
మా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈ రోజు కనీసం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు కూడా వాటిలో ఎగుమతి చేశాం. చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి.
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
⇒దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. అందుకే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా దేనికీ గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది కూడా ధాన్యంతో సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు.
⇒గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసేవాళ్లం. ఆర్బీకేల్లో ఆ వివరాలు ప్రదర్శించే వాళ్లం. సీఎం–యాప్ ఉండేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, వెంటనే జేసీ అప్రమత్తమై, జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవారు. అలా రూ.7,746 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. అందుకే ఈ రోజు పరిస్థితిని గమనించమని కోరుతున్నాను.
హామీలన్నీ గాలికి.. అంతటా దోపిడీ
⇒సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం.
⇒ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తున్నారు. ఇసుక, సిలికా, క్వార్ట్‌జ్.. దేన్నీ వదలకుండా అన్ని వనరులు, గనులను దోచేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తూ అక్కడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు.
ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం
చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజలను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.
అనంతరం ఒక రైతు మాట్లాడుతూ ‘అయ్యా.. చంద్రబాబు గారూ.. మీరు వ్యవసాయం దండగ అంటున్నారు కదా.. మీరు ఏం తిని బతుకుతున్నారు? ఇనుప ముక్కలు తిని బతుకుతున్నారా? రైతులు ఒక్కసారి పంటలు వేయకపోతే.. ప్రజలు ఏం తింటారు? వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకూ తప్పని కష్టాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పిల్లలతో కలిసి పోరాడుతున్నాం. డిసెంబర్ వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుంటాయి. ఒక్కో క్వార్టర్‌కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెట్టుబడి కూడా రాలేదు
నాకున్న ఆరు ఎకరాల భూమిలో దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి అరటి పంటను సాగు చేశాను. ఎరువులు, మందులు వాడటంతో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. కాయ కూడా నాణ్యంగా ఉంది. అయితే మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం లేదు. దీంతో తోటలోనే పండ్లు మాగి కింద పడిపోతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాను. పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అరటి రైతులను ఆదుకోవాలి.

– శ్రీనివాసరెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందుల
అరటి పంటను అడిగే నాథుడే లేడు
ఎంతో కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి అరటి పంట సాగు చేసి మంచి దిగుబడి వచ్చిందన్న సమయంలో కొనుగోలు చేసే నాథుడే లేడు. అరటి చెట్లకే పండ్లు మాగి కిందపడిపోతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.32 వేల వరకు టన్ను అరటి కాయల ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ.2 వేలకు అమ్ముదామన్నా కొనే వారు లేరు. ప్రభుత్వం రైతులను పట్టించుకొని అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే రైతుల వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం దారుణం.

– రామతులశమ్మ, బ్రాహ్మణపల్లి, పులివెందుల
పంటను దున్నేయాల్సిన దుస్థితి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో అరటి పంటకు మంచి ధరలు ఉన్నాయని ఆశించి ఈ ఏడాది భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేశాం. తీరా పంట దిగుబడి వచ్చి మార్కెట్‌లో అమ్ముదామనుకున్న సమయంలో వ్యాపారులు, ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు స్పందించడం లేదు. దీంతో అరటి కాయలు చెట్లకే మాగిపోతున్నాయి. అరటి పంటను ట్రాక్టర్లతో దున్నుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా అరటి రైతుల సమస్యలను గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.

– రామచంద్రారెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందుల
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తే, తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక తల్లిడిల్లిపోతున్నాం. నేను, నా స్నేహితుడు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి, టమాట పంటలను సాగు చేశాం. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడులు పెట్టాం. కనీసం ఒక్కరూపాయి కూడా మాకు డబ్బు రాలేదు. టమాట పంటను అమ్మడానికి మార్కెట్‌కు పోతే కొనేనాథుడు లేక మార్కెట్ వద్ద పారబోశాను. ఆటో బాడుగ కూడా చేతి నుంచి పడింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.

– బాబురెడ్డి, ఇనగలూరు, తొండూరు మండలం


