చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్‌కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్‌లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.
జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్‌కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.
అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.
అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు.


