ఈనాడు గ్రూపు అధినేత, దివంగత రామోజీరావు ఎన్నడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో చెప్పినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ చెప్పిన ఈ మాటలను ఉమ్మడి ఏపీ రాజకీయాలను, విభజిత ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను గమనించిన వారెవ్వరూ నమ్మరనే చెప్పాలి.
రేవంత్‌తోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామోజీ గుణగణాలను కీర్తిస్తూ ప్రజల పక్షాన నిలిచిన యోధుడు అని పేర్కొన్నారు. ఇలాంటి ఫంక్షన్స్‌లో ప్రశంసలు సహజం. కాని అవి అతిశయోక్తులుగా మారినప్పుడు, నమ్మదగినవిగా లేనప్పుడు, వాస్తవాలకు దూరంగా ఉన్నప్పుడే చర్చనీయాంశం అవుతాయి. 2009 శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడానికి నెల రోజుల ముందు టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కూటమి గెలుస్తుందన్న అంచనాతో, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారన్న నమ్మకంతో ఆ రోజుల్లో టీడీపీలో ఉన్న రేవంత్, మరో ముగ్గురు నేతలు రామోజీని కలిశారట.
ఆ సందర్భంలో వీరు ప్రస్తావన చేయడానికి ముందే తానెప్పుడూ ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పలేదని రామోజీ అన్నారట. మంత్రులుగా కన్నా ఎమ్మెల్యేలుగానే రాణిస్తారని తన దగ్గరకు వచ్చేవారికి సూచిస్తానని ఆయన చెప్పారని రేవంత్ వివరించారు. నిజానికి ఈ అంశంపై రేవంత్ కు క్లారిటీ ఉండదని అనుకోనవసరం లేదు. రామోజీ ఇలాంటివి ప్రోత్సహించరని రేవంత్, ఇతర టీడీపీ నేతలు భావించి ఉంటే అసలు ఆయనను కలిసేవారు కాదు కదా! రామోజీ ఏమి చెబితే అది చంద్రబాబు వింటారన్న అభిప్రాయమో, నమ్మకమో లేకుండా వీరు వెళతారా?
రామోజీ మీడియా రంగ ప్రవేశం, ఆ తర్వాత రాజకీయాలను ప్రభావితం చేసిన తీరు పరిశీలనార్హమే. ఆయన తెలివిగా వ్యాపారాన్ని,రాజకీయాలను కలగలిపి తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు.1970లలో ఈనాడు మీడియా ఎదుగుదలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సహకారం తీసుకున్న విషయం వయసులో చిన్నవాడైన రేవంత్‌కు తెలియకపోవచ్చు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో రామోజీ ఆ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ఇస్తూ అది చారిత్రక అవసరమని తన జర్నలిస్టులకు ఉద్బోధించారు. తెలుగుదేశం పార్టీ తన మీడియావల్లే అధికారంలోకి వచ్చిందన్న భావనను కల్పించగలిగారు. కానీ ఎన్టీరామారావుకు ఎన్.టి.రామారావుకు, ఆ పార్టీలో పలువురికి ఇది అంతగా నచ్చలేదు. ఎన్టీఆర్ బొమ్మలను తన పత్రికలో ముద్రిస్తూ రామోజీ సర్కులేషన్ పెంచుకున్నారన్నది వారి భావన. ఒక సందర్భంలో ఈ విషయమై ఎన్టీఆర్ వద్ద చర్చ కూడా జరిగింది.
1983 శాసనసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఎంపికలో ఈనాడు సిబ్బంది గణనీయ పాత్ర పోషించింది. నియోజకవర్గాలలో టీడీపీ టిక్కెట్ కోరుకుంటున్న అభ్యర్ధులపై సర్వేలు నిర్వహించి ఎన్టీఆర్‌కు తమ సిఫారసులను అందించేవారు. ఒక మీడియా సంస్థ ఇలా రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పనిచేయడం కరెక్టేనా? ఎమ్మెల్యే అభ్యర్ధులనే నిర్ణయించినవారు మంత్రి పదవులను కనీసం కొందరికైనా చెప్పి ఉండరంటే నమ్మగలమా? టీడీపీ పక్షాన పనిచేస్తే ప్రజల పక్షాన పనిచేసినట్లు అవుతుందేమో చంద్రబాబే వివరించాలి.
అప్పట్లో వామపక్షాలు, జనత, లోక్‌దళ్ వంటి పార్టీలు కూటమిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవి. సరిగ్గా ఆ టైమ్‌లో ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో రాజకీయం మారిపోయింది. దాంతో టీడీపీ, వామపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు జరిగాయి. ఆ చర్చలు కూడా రామోజీ నివాసంలో జరిగాయని చెబుతారు. టీడీపీ గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పడప్పుడూ రామోజీని నివాసంలో కలుస్తుండేవారు. టీడీపీ విజయం సాధించడం, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయిన ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చేశారు.
అప్పట్లో చంద్రబాబుపై కూడా ఈనాడు మీడియాలో కొంత వ్యతిరేక కథనాలు వచ్చేవి. కార్టూన్లు కూడా వేసేవారు, కాని తదుపరి కాలంలో ఎన్టీఆర్‌కు రామోజీకి మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. ఒక భవన నిర్మాణ అనుమతి విషయంలో వీరిద్దరికి తేడా వచ్చిందని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అలాగే రామోజీ తాను చెప్పినట్లు జరగాలని ఆశించేవారట. దానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని అంటారు. ఈ లోగా చంద్రబాబు వ్యూహాత్మకంగా రామోజీని కలిసి తనపై వ్యతిరేకత లేకుండా చేసుకోగలిగారు. కారణం ఏమైనా కాని 1989 ఎన్నికల సమయంలో ఈనాడు టీడీపీకి అనుకూలంగా లైన్ తీసుకోలేదని చెప్పాలి. ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు సీఎంలు రామోజీతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి యత్నించకపోలేదు. కొన్నిసార్లు వారికి అనుకూలంగా వ్యహరించే వారు. అందులో తన వ్యాపార ప్రయోజనాలను కూడా చూసుకునేవారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల్లోని కొందరు నాయకులను ఆకట్టుకుని వారితో సంబంధాలు నెరపేవారు. అంతేకాదు.కొందరు ఐఏఎస్ అధికారులకు కూడా ప్రత్యేక విందులు ఇచ్చేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మరికొందరు టీడీపీ నేతలు తరచు రామోజీని సంప్రదించేవారు. మీడియా రంగంలో ఒక మెరుపులా వచ్చిన ఉదయం దినపత్రికను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సరిగా నడపలేక కాంగ్రెస్ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డికి బదలాయించారు. సరిగ్గా ఆ తరుణంలోనే నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి రామోజీ మద్దతు ఇచ్చారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమాగమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆహ్వానించి ఒక కార్యక్రమం పెట్టారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, విపక్ష నేత ఎన్టీఆర్ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ స్పీచ్ విన్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి నచ్చక విజయభాస్కరరెడ్డి సభ నుంచి నిష్క్రమించారు.
ఈనాడు మీడియాలో నిత్యం కొన్ని పేజీలు కేటాయించి సారా వ్యతిరేక ఉద్యమ వార్తలు ఇస్తుండే వారు. ఆ క్రమంలో కోట్ల ప్రభుత్వం సారాను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఈనాడు మీడియా ప్రచారం ఆగుతుందని ఆయన భావించారు. కాని రామోజీ ఆపలేదు. సంపూర్ణ మద్య నిషేధం చేయాలన్న డిమాండ్‌తో వార్తలు ఇచ్చేవారు. పలు చోట్ల కృత్రిమ ఆందోళనలు సృష్టించి ఆ వార్తలను కూడా ఇస్తుండేవారు. దీనిపై కోట్లకు అసంతృప్తి ఉండేది. తాను రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటుకు సహకరించి, కీలకమైన భూమి సుమారు పదెకరాలు కేటాయించానని అయినా రామోజీ ద్రోహ చింతనతో వ్యహరించారని కోట్ల వాపోయేవారు.
ఇదంతా మాగుంటను దృష్టిలో పెట్టుకునే చేశారని చాలా మంది నమ్ముతారు. అప్పటికే మాగుంట మద్యం వ్యాపారంలో ఉండడంతో, ఆ డబ్బుతో పత్రికను సక్సెస్ చేస్తే తనకు నష్టం అని ఆయన భావించే ఇలా సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఎత్తుకున్నారన్నది పలువురి భావన. ఇంతలో ఎన్టీఆర్ ఇదే నినాదంతో జనంలోకి వెళ్లారు.1994లో అన్ని కలిసి వచ్చి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఒక దశలో రామోజీరావు సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు. దాని అనుపానుల మీద అభిప్రాయ సేకరణ కూడా చేశారు. కాని ఎందువల్లో ముందుకు తీసుకువెళ్లలేదు.
1994లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని రామోజీ ఊహించలేదు. కొన్నిసీట్లు తక్కువ వస్తే ప్రత్యామ్నాయంగా రాజకీయం ఎలా చేయాలన్న దానిపై చంద్రబాబు వంటివారితో చర్చలు జరిగాయని కూడా ఆరోజుల్లో వినిపించేది. కాని అనూహ్య స్థాయిలో ఎన్టీఆర్ గెలిచారు. రామోజీతో తిరిగి ఎన్టీఆర్‌కు సత్సంబందాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా కొన్నిసార్లు చొరవ తీసుకున్నారు. అవన్ని పెద్దగా ఫలించలేదు. ఈలోగా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలపై ఈనాడులో దారుణమైన కార్టూన్లు వేయించడం, సంపాదకీయాలు రాయడం వంటివి జరిగాయి. తదుపరి టీడీపీలో జరిగిన పరిణామాలలో చంద్రబాబు కొమ్ముకాశారు. ఆ క్రమంలో ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంలో రామోజీ ముఖ్య భూమిక పోషించారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీ ఏమి అనుకుంటే అది జరిగేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం చంద్రబాబు ప్రతి వారం రామోజీ ఇంటికి వెళ్లేవారు. ఇద్దరూ ప్రభుత్వ పార్టీ విషయాలను మాట్లాడుకునేవారు. అప్పుడే ఈయనకు రాజగురు అన్న పేరు కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మంత్రుల పేర్లు సిఫారస్ చేశారా ? లేదా? అన్నది చర్చకాదు. స్వతంత్రంగా ఉండవలసిన మీడియాను ఒక పార్టీకి అనుబంధంగా మార్చడం సరైనదేనా? అంశాల మీద రాయడం వేరు. స్వతంత్ర మీడియా ముసుగులో ఒక పార్టీ కొమ్ము కాయడం వేరు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో రామోజీ ఎవరిని సిఫారస్ చేయలేదన్నది మాత్రం అసత్యం. గుంటూరు జిల్లా టీడీపీ నేతకు మంత్రి పదవి రావడంలో, 2014 తర్వాత మరో ముఖ్యమైన పదవి రావడంలో రామోజీ పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబు మద్య నిషేధం ఎత్తి వేసినా ఒక సంపాదకీయం రాసేసి సరిపెట్టుకోవడంలో ఆయనకు ఉన్న హోటళ్లు, రామోజీ ఫిలిం సిటీ వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. రింగ్ రోడ్డులో తన భూమి కొంత కోల్పోవలసి వస్తోందన్న కోపంతో వైఎస్సార్‌పై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తారు.
ఒక సందర్భంలో ‘‘ఉల్టాచోర్, కొత్వాల్ కో డాంటే’’ అంటూ ఒక సంపాదకీయం రాశారు. ఆ సమయంలోనే రామోజీ మార్గదర్శి ఫైనాన్స్‌లో చట్టవిరుద్దంగా సాగుతున్న డిపాజిట్ల సేకరణ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెలుగులోకి తెచ్చారు. దానిపై వైఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి వైఎస్ కుటుంబంపై రామోజీ పగపట్టినట్లు వ్యవహరిస్తూ వచ్చారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌పై కూడా అదే ద్వేషంతో విష ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయినా, విపక్షంలో ఉన్నా ఇదే పద్దతి అనుసరిస్తుంటుంది. చంద్రబాబు ఏమి చేసినా సమర్థిస్తూ టీడీపీని భుజాన వేసుకుని ఈనాడు మీడియా పనిచేస్తోంది. ఆ రోజుల్లో టీడీపీలో రామోజీని రాజగురు అని కూడా సంబోధించే వారు .ఈనాడు మీడియాకు చంద్రబాబు విధేయుడుగా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం తన పాత వాసనలు మరవలేకపోతున్నారేమో అనిపిస్తుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు,
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


