సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందేరం చేసే కుట్రలకు తెర తీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచి పెట్టేందుకు కేబినెబ్‌లో తీర్మానం చేశారు. మూడు వేల కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారుచౌకగా 25 కోట్లకు కట్టబెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు.
దేవాలయాల పవిత్రను దెబ్బతీస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చూపిస్తే.. అలా చూపించిన వారిపైనే కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఆలయాల్లో జరుగుతున్న ఘటనలకు ఏమని సమాధానం చెబుతుంది?. చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీపై విషప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.



