హుజూరాబాద్: చెక్ డ్యామ్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాస్ట్ చేసినట్లు అనుమానాలున్నాయని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను తాను చూపిస్తానంటూ సవాల్ చేశారు కౌశిక్‌రెడ్డి. వాస్తవాలు చూపిస్తే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావ రాజకీయాల నుంచి తప్పుకుంటారా?, అని ప్రశ్నించారు. లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డిలా మాట తప్పుతారా అంటూ విమర్శించారు కౌశిక్‌రెడ్డి.
రాష్ట్రంలో మిషన్ భగీరథలో భాగంగా తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 చెక్ డ్యామ్‌లు నిర్మిస్తే వాటిని సీఎం రేవంత్ సర్కార్ కూల్చివేస్తుందంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి-పెద్దపల్లి గుంపుల మధ్య ఉన్న కూలిన చెక్ డ్యామ్‌ను కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు సందర్శించారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. ఆ చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడానికి ప్రయత్నించిని పోలీసులు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ఇసుక మాఫియా కోసం రాత్రికి రాత్రే ఆ చెక్ డ్యామ్‌ను పేల్చివేశారని రైతులు, మత్స్యకారులు చెబుతున్నారని మండిపడ్డారు. అయితే దీనిపై ఎమ్మెల్యే విజయరామారావు స్పందించగా, దానికి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చెక్ డ్యామ్‌ను పేల్చేసినట్లు అనుమానాలున్నాయంటూనే వాస్తవాలను చూపిస్తానన్నారు.


