అమెరికా: మరోసారి కాల్పులు.. నలుగురి మృతి | california Multiple dead at childs birthday party in targeted incident | Sakshi
Sakshi News home page

అమెరికా: మరోసారి కాల్పులు.. నలుగురి మృతి

Nov 30 2025 11:10 AM | Updated on Nov 30 2025 12:36 PM

california Multiple dead at childs birthday party in targeted incident

స్టాక్‌టన్‌: కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ బాలుడి పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. ఓ విందు హాల్‌లో జరిగిన ఈ వేడుకలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, 19 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు పరారీలో ఉన్నారని తెలియవచ్చింది.

ఈ ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ‘ఎక్స్‌’లో వివరాలు అందించింది. లూసిల్ అవెన్యూలోని 1900 బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటన దరిమిలా డిప్యూటీలు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రారంభ నివేదికల్లో కాల్పులు డైరీ క్వీన్ రెస్టారెంట్‌ సమీపంలో జరిగాయని తెలిపారు. ఈ ఘటనపై స్టాక్‌టన్ వైస్ మేయర్ జాసన్ లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పుట్టినరోజు పార్టీ జరుపుకునే ప్రదేశం.. ప్రజలు తమ ప్రాణాల కోసం భయపడే ప్రాంతంగా మారడం విచారకరమన్నారు. ఘటనా స్థలంలో ఏమి జరిగిందో తెలుసుకునేందుకుప్రజా భద్రతా అధికారులతో సంప్రదిస్తున్నానని వైస్ మేయర్ తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
 
ఈ లక్షిత దాడిలో పాల్గొన్న అనుమానితుడి గురించి అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట వివరాలను విడుదల చేయలేదు. అయితే దర్యాప్తు చురుకుగా కొనసాగుతోంది. గాయపడిన బాధితుల పరిస్థితిపై తాజా సమాచారం తెలియాల్సి ఉంది. స్థానికులు పంచుకున్న వీడియోలు, కథనాల ప్రకారం, పిల్లల పుట్టినరోజు వేడుకలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో వేడుకల్లో పాల్గొన్నవారు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటన జరిగిన డైరీ క్వీన్ రెస్టారెంట్ సమీపంలోని ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. 

కాగా రెండు రోజుల క్రితంఅమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులకు జరిగాయి. వీరిని వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ సభ్యులుగా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అవి ప్రాణాపాయం కాని గాయాలని చట్ట అమలు అధికారులు తెలిపారు. అనుమానితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన గురించి గవర్నర్ పాట్రిక్ మోరిస్సే స్పందిస్తూ ‘దర్యాప్తు కొనసాగుతున్నందున మేము సమాఖ్య అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని అన్నారు.


 

ఇది కూడా చదవండి: National Herald Case: ‘గాంధీ’లకు బిగుస్తున్న ఉచ్చు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement