పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్‌ క్రికెటర్‌! | Former Afghan cricketer Shapoor Zadran hospitalised in India | Sakshi
Sakshi News home page

పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్‌ క్రికెటర్‌!

Apr 18 2026 5:53 PM | Updated on Apr 18 2026 6:41 PM

Former Afghan cricketer Shapoor Zadran hospitalised in India

38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షాపుర్ జద్ర‌న్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లర‌క్త క‌ణాల సంఖ్య ప‌డిపోవ‌డంతో ప్ర‌స్తుతం షాపుర్ జ‌ద్ర‌న్‌ భార‌త్‌లోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్ల‌ర‌క్త క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో అత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. 

మ‌రో 18 గంట‌లు గ‌డిస్తే కానీ షాపుర్ జ‌ద్ర‌న్ ఆరోగ్య ప‌రిస్థితి ఏంట‌నేది చెప్పలేమ‌ని వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జ‌ద్ర‌న్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో కూడా షాపుర్ జ‌ర్ద‌న్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. 

అయితే కొన్ని వారాల కింద‌టే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జ‌ద్ర‌న్ చాలా రోజుల ఆసుప‌త్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవ‌లే డిశ్చార్జి అయిన అత‌డు మ‌రోసారి ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జ‌ద్ర‌న్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు. జ‌ద్ర‌న్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. 

పాక్‌కు చెందిన మ‌రో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జ‌ద్ర‌న్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌యం తెలుసుకొని బాధ‌ప‌డ్డాడు. అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడిన షాహిద్ అఫ్రిది త‌న చిర‌కాల మిత్రుడు షాపుర్ జ‌ద్ర‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ ఎదుగుద‌ల‌లో షాపుర్ జ‌ద్ర‌న్ కీల‌క పాత్ర పోషించాడు. ద‌శాబ్దానికి పైగా ఆఫ్గ‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన షాపుర్ జ‌ద్ర‌న్ నిప్పులు చెరిగే బంతుల‌తో ప్ర‌పంచ మేటి బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. 

స్టీవ్ స్మిత్‌, కేన్ విలియ‌మ్స‌న్‌, డేవిడ్ వార్న‌ర్ వంటి బ్యాట‌ర్ల‌ను త‌న స్వింగ్ బౌలింగ్‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టి పెవిలియ‌న్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్‌తో వ‌న్డే మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షాపుర్ జ‌ద్ర‌న్ అప్గానిస్తాన్ త‌ర‌ఫున 43 వ‌న్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అఫ్గానిస్తాన్ త‌ర‌ఫున మూడు టీ20 ప్ర‌పంచ‌క‌ప్పుల్లో పాల్గొన్న షాపుర్ జ‌ద్ర‌న్ 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స్కాట్లాండ్‌పై విజ‌యం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసిన అఫ్గానిస్తాన్ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు.

చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement