38 ఏళ్ల వయసులో అఫ్గాన్‌ క్రికెటర్‌ కన్నుమూత | Afghanistan Former Cricketer Shapoor Zadran passes away 38 | Sakshi
Sakshi News home page

38 ఏళ్ల వయసులో అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ కన్నుమూత

Jul 7 2026 3:26 PM | Updated on Jul 7 2026 3:51 PM

Afghanistan Former Cricketer Shapoor Zadran passes away 38

అఫ్గానిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాపూర్‌ జద్రాన్‌ కన్నుమూశాడు. అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ఈ విషయాన్ని మంగళవారం ధ్రువీకరించింది. కాగా షాపూర్‌ జద్రాన్‌ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. వ్యాధి కారణంగా అతడి శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది.

ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో.. అఫ్గాన్‌ నుంచి భారత్‌కు తరలించి అత్యాధునికి చికిత్స అందిస్తున్నారు. గత కొన్నినెలలుగా న్యూ ఢిల్లీలోని ఆస్పత్రిలో ఉన్న షాపూర్‌ జద్రాన్‌ తాజాగా తుదిశ్వాస విడిచాడు. బుధవారమే అతడు 39వ వసంతంలో అడుగుపెట్టాల్సింది. అలాంటిది పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అతడు మరణించడం కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది.

ఆరడుగుల బౌలర్‌
ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తుతో.. జులపాల జుట్టుతో.. తనదైన శైలిలో బౌలింగ్‌ చేస్తూ చాలాకాలం అభిమానులను అలరించాడు షాపూర్‌ జద్రాన్‌. అఫ్గాన్‌ తరఫున 2009- 2020 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు ఈ ఫాస్ట్‌ బౌలర్‌.

ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడిన షాపూర్‌.. వన్డేల్లో 43, టీ20లలో 37 వికెట్లు కూల్చాడు. మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ జట్లలో భాగమయ్యాడు. 

అఫ్గాన్‌ క్రికెట్‌ నివాళి
షాపూర్‌ జద్రాన్‌ మరణం పట్ల అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గాన్‌ క్రికెట్‌ అభివృద్ధిలో అతడూ భాగమయ్యాడని.. చిన్న వయసులోనే అతడు కన్నుమూయడం కలచివేసిందని విచారం వ్యకత​ం చేసింది. షాపూర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement