PC: X
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్లు, కోచ్‌ల విషయంలో నిలకడ ఉండదు. ఎప్పుటికప్పుడు సారథులు, మార్గ నిర్దేశకులు మారుతూనే ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి షాన్ మసూద్‌ను తప్పించిన పాక్ బోర్డు.. మళ్లీ బాబర్ ఆజంకే పగ్గాలు అప్పగించింది.
పాకిస్తాన్‌కు గుడ్‌బై
ఇక పాక్ జట్టు కోచింగ్ విభాగంలోనూ ఇటీవలే ఓ మార్పు చోటుచేసుకుంది. ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన షేన్ మెక్‌డెర్మాట్ ఇటీవలే ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. తాజాగా అతడు అఫ్గానిస్తాన్ క్రికెట్ సీనియర్ జట్టు అసిస్టెంట్, ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటించింది.
ఆగష్టు 1 నుంచి ఐర్లాండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి మెక్‌డెర్మాట్ అఫ్గాన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా గతంలోనూ మెక్‌డెర్మాట్ అఫ్గాన్ కోచ్‌గా పనిచేశాడు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు బాధ్యతలు నిర్వర్తించిన అతడు..ఆ తర్వాత పాక్ కోచ్‌గ వెళ్లాడు.
అయితే, స్వల్ప కాలంలోనే పాక్ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లకు సహాయక కోచ్‌గానూ మెక్‌డెర్మాట్ పనిచేశాడు.
వాళ్లు సైతం...
ఇదిలా ఉంటే.. మెక్‌డెర్మాట్ కంటే ముందు గ్యారీ కిర్‌స్టన్, జేసన్ గిల్లెస్పి పాక్ హెడ్‌కోచ్ పదవుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు తాత్కాలిక కోచ్‌లను నియమించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత మైక్ హసన్‌ను పూర్తిస్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది.
అయితే, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ- మైక్ హసన్ మధ్య విభేదాలు మొదలయ్యాయని.. త్వరలోనే అతడూ పాక్ జట్టును వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పాక్ క్రికెట్ జట్టు ఇటు ఆటలోనూ.. అటు కోచింగ్ సభ్యుల విషయంలోనూ నిలకడ లేకుండా ఛిన్నాభిన్నం అవుతోందన్న చర్చ జరుగుతోంది.
చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం!


