పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు పీసీబీ ముందుకు వచ్చింది.
కాగా సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా లేదు. స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే క్రమంలో లోకల్ గ్రౌండ్లలో మాత్రమే టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియన్ క్రికెట్ ఫెడరేషన్ (SACF) ఆట అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్టేడియాలు కూడా అవసరమని భావించింది.
ఈ క్రమంలోనే స్టేడియం నిర్మాణం కోసం పీసీబీని సంప్రదించింది. ఇందులో భాగంగా జెద్దాలో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణం కోసం పీసీబీతో మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MOU) కుదుర్చుకుంది. ఈ క్రమంలో పీసీబీ.. స్టేడియం డిజైన్, పిచ్‌ల రూపకల్పన, సహాయక సిబ్బంది శిక్షణ, ఆతిథ్యం, ప్రసారాలు.. తదితర అంశాల్లో సౌదీకి సాయం చేయనుంది.
సౌదీ బోర్డుకు ఒక సాంకేతిక భాగస్వామి (టెక్నికల్ పార్ట్‌నర్)లా పీసీబీ వ్యవహరించనుంది. సౌదీ విజన్ 2030 (స్పోర్టింగ్ పోర్ట్‌ఫోలియో)లో భాగంగా పాక్‌తో సౌదీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి కాలంలో సౌదీ ఫుట్‌బాల్, ఎఫ్1, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది.
ఇక గల్ఫ్ ప్రాంతంలో ఎక్కువగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చిన వారు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా క్రికెట్‌కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జెద్దాలో తొలి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పూనుకుంది.
పీసీబీతో సౌదీ బోర్డు కుదుర్చుకున్న MOUలోని ప్రధాన అంశాలు
👉జెద్దాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, అభివృద్ధి
👉జెద్దాలో అంతర్జాతీయ మ్యాచ్, ఈవెంట్ల నిర్వహణ
👉క్రికెట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి: ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అఫీషియల్స్‌కు అవకాశాలు పెంచడం
👉క్రికెట్ అభివృద్ధి: తరచూ మ్యాచ్‌లు నిర్వహించడం, టెక్నికల్ ప్రోగ్రామ్స్, నైపుణ్యాల మార్పిడి.
👉స్పోర్ట్ టూరిజంలో పెట్టుబడులు
👉సౌదీ విజన్ 2030: క్రీడా రంగానికి మద్దతు.


