ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ భారత్‌కు రానున్నాడనే ప్రచారం జరిగింది.
భారత్‌కు పాక్ బోర్డు చీఫ్?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బోర్డు సమావేశానికి హాజరవుతాడని వదంతులు వచ్చాయి. కాగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది వ్యవహారశైలిని ఎండగట్టిన భారత్.. పాక్‌లో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం ఈ పని పూర్తి చేయగా... ప్రతిగా పాక్ ఆర్మీ కూడా రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంది. ఇలాంటి తరుణంలో భారత్- పాక్ తొలిసారి ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి.
అయితే, ఈ మ్యాచ్‌లలో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి టీమిండియా నిరాకరించింది. దీనిని గురించి రచ్చ చేసిన పీసీబీకి ఆఖరికి నిరాశే మిగిలింది. ఫైనల్లో పాక్‌పై గెలిచి భారత్ టైటిల్ గెలిచింది.
ట్రోఫీని ఎత్తుకెళ్లిన నక్వీ
ఈ క్రమంలో ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడి హోదాలో నక్వీ తన చేతుల మీదుగా ట్రోఫీ ఇచ్చేందుకు సిద్ధం కాగా.. టీమిండియా తిరస్కరించింది. దీంతో ట్రోఫీని నక్వీ తనతో పాటు ఎత్తుకెళ్లి ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఇక ఈ ఘటన తర్వాత టీ20 ప్రపంచకప్-2026 సమయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ నానాయాగీ చేసింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అనుకూలంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటోందని ఆరోపించింది. బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవడంతో పాటు తాము కూడా తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. అయితే, ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించగా.. పట్టువీడి టోర్నీలో పాల్గొంది.
అతడిని ఎలా ఆహ్వానిస్తారు?
చెత్త ప్రదర్శనతో సెమీస్ చేరుకుండానే పాక్ నిష్క్రమించగా.. భారత్ ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో నక్వీ భారత్‌కు వస్తున్నాడనే వార్త కలకలం రేపింది. అతడిని ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తూనే.. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐసీసీ చైర్మన్ జై షాకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేశారు.
ఆన్‌లైన్ వేదికగా
అయితే, అందరూ ఊహించినట్లుగా నక్వీ అహ్మదాబాద్‌కు రావడం లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అతడు వర్చువల్‌గా హాజరుకానున్నాడు. ఆన్‌లైన్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకోనున్నాడు. నిజానికి ఐసీసీ ఈ సమావేశానికి వేదికగా దోహాను ఎంచుకుంది.
అయితే, పశ్చిమాసియా యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ నాడు సమావేశం నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే నక్వీ వర్చువల్‌గా ఈ మీటింగ్‌కు హాజరుకానున్నాడు.
చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ


