‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్‌ కెరీర్‌ ఖతం’ | I didn't drop him, If I Leave Him he would be finished: Ganguly on Dravid ODI Career | Sakshi
Sakshi News home page

సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ

May 17 2026 11:09 AM | Updated on May 17 2026 12:00 PM

I didn't drop him, If I Leave Him he would be finished: Ganguly on Dravid ODI Career

టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ‘మిస్టర్‌ డిపెండబుల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో సత్తా చాటిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. సారథిగానూ సేవలు అందించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 344 వన్డేలు ఆడిన ద్రవిడ్‌.. 10,889 పరుగులు సాధించాడు.

వన్డే జట్టులో చోటు కరువయ్యే పరిస్థితి
అదే విధంగా టీమిండియా తరఫున 164 మ్యాచ్‌లలో 13288 పరుగులు రాబట్టాడు ద్రవిడ్‌ (Rahul Dravid). అయితే, 2000లలో ఒకానొక దశలో ద్రవిడ్‌కు వన్డే జట్టులో చోటు కరువయ్యే పరిస్థితి తలెత్తిందట. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీ ద్రవిడ్‌కు అండగా నిలిచి.. అతడి కెరీర్‌ కొనసాగేందుకు దోహదపడ్డాడట.

గంగూలీనే స్వయంగా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. రాజ్‌ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘రాహుల్‌ ద్రవిడ్‌.. చాలా మంది నా దగ్గరికి వచ్చి.. అతడి స్ట్రైక్‌ రేటు బాగా లేదని చెప్పేవారు. సెలక్టర్లు సైతం వన్డేల్లో ద్రవిడ్‌కు బదులు వేరొక ఆటగాడిని ప్రయత్నిద్దాం అనేవారు.

ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు
అవును హిట్టింగ్‌ ఆడాల్సిందే. కానీ ఏదైనా పరిస్థితులకు తగ్గట్లే ఉండాలి. నేను మాత్రం ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు. ఎందుకంటే ఒక్కసారి వదిలేస్తే... అతడి కెరీరే సమాప్తమైపోతుంది. ఈ విషయం గురించి నేను అతడితో ఒంటరిగా మాట్లాడేవాడిని.

జామ్‌ (ద్రవిడ్‌ ముద్దుపేరు).. నువ్వు కాస్త మారాలి అని చెప్పేవాడిని. అతడొక గొప్ప ఆటగాడు.. వన్డే ఫార్మాట్‌కు తొందరగానే అలవాటుపడిపోయాడు. టీమిండియా తరఫున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతో పాటు వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందించాడు.

ఆ జట్లకు వాళ్లు.. మాకు ద్రవిడ్‌
నిజానికి ఆరోజుల్లో మాకు బ్యాటింగ్‌ చేసే వికెట్‌ కీపర్‌ లేడు. ఆ సమయంలో శ్రీలంకకు కుమార్‌ సంగక్కర, సౌతాఫ్రికాకు మార్క్‌ బౌచర్‌, ఆస్ట్రేలియాకు ఆడం గిల్‌క్రిస్ట్‌ వికెట్‌ కీపర్లుగా ఉన్నారు.

వాళ్లంతా గొప్పగా బ్యాటింగ్‌ చేయగలరు కూడా!.. కానీ మా బ్యాటింగ్‌ ఆరో స్థానంతో ముగిసిపోయేది. అలాంటి సమయంలో ద్రవిడ్‌ను కీపర్‌గా నియమించాము. కైఫ్‌ ఏడో స్థానంలో వచ్చేవాడు. అలా మా బ్యాటింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారింది’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ​

హెడ్‌కోచ్‌గానూ..
కాగా 1996లో భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రాహుల్‌ ద్రవిడ్‌.. 2012లో తన చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడాడు. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీలో యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దిన ఈ కర్ణాటక దిగ్గజం.. ఆ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చాడు. అతడి మార్గదర్శనంలో 2023లో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరిన టీమిండియా.. 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచింది.

చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ

Advertisement
 
Advertisement
Advertisement