టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జాతీయ జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే సారథిగా ఎదిగిన ఈ ‘జార్ఖండ్ డైనమైట్’.. అద్భుతమైన విజయాలు సాధించాడు.
అత్యధికంగా మూడు ఐసీసీ టైటిళ్లు
ధోని సారథ్యంలో 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ గెలిచింది. అనంతరం 2011లో సొంతగడ్డపై టీమిండియాకు వన్డే వరల్డ్‌కప్ అందించాడు ధోని. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలోనే భారత్ 2013 నాటి చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ చరిత్రలో జట్టుకు అత్యధికంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా ధోనీ (MS Dhoni) నేటికీ కొనసాగుతున్నాడు. అయితే, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన ప్రదర్శనపై అసంతృప్తి చెందిన ధోని.. ఆ తర్వాత కెప్టెన్సీ వదిలేశాడు. ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అప్పుడు నేనే కెప్టెన్
ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనిని ఉద్దేశించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని మాదిరి సిక్సర్లు బాదిన ఆటగాడిని అరుదుగా చూస్తుంటాం. అతడు టీమిండియాలోకి వచ్చినపుడు నేనే కెప్టెన్‌గా ఉన్నాను.
అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు
అప్పట్లో అతడు చాలా సిక్సర్లు బాదేవాడే. అయితే, ఆ తర్వాత ధోని ఆట తీరు నాకు నచ్చలేదు. అతడి కెరీర్‌లో ఆటగాడిగా మొదటి దశ మాత్రమే నాకు నచ్చింది. రెండో దశ అస్సలు నచ్చలేదు.
మొదట్లో అయితే సరదా కోసం అలవోకగా సిక్సర్లు బాదేవాడు. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడంటే కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టేవాడు. కానీ ఆ తర్వాత సింగిల్స్, డబుల్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాడు. ఏదేమైనా అతడు గొప్ప ఆటగాడిగా.. దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగిన తీరు ప్రశంసనీయం’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
44 ఏళ్ల వయసులోనూ
కాగా 44 ఏళ్ల వయసులోనూ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్నాడు ధోని. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తలా.. ప్రస్తుతంగా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే, ఈ ఏడాది మోకాలి గాయం ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లీగ్ దశలో చెన్నైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో ధోని ఆడటం కష్టమే.


