లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఫాస్ట్ బౌలర్ల నుంచి తాను మెరుగైన ప్రదర్శన ఆశించానని.. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ పరాజయానికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
బౌలర్ల వైఫల్యం
గత మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన చెన్నై.. శుక్రవారం ఏకనా స్టేడియంలో లక్నోతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో చెన్నైపై జయభేరి మోగించి.. రుతురాజ్ సేన ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ మరీ దారుణంగా కేవలం 2.4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి బౌలింగ్‌లో లక్నో బ్యాటర్లు చితక్కొట్టారు.
వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘మేము బ్యాటింగ్ చేసినపుడు వికెట్ కఠినంగా ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఈ పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. మేము 160- 170 పరుగులే చేస్తామనుకున్నా.
అయితే, 180 స్కోరు దాటగలిగాము. బ్యాటింగ్ పరంగా మా తప్పేమీ లేదు. క్రెడిట్ ప్రత్యర్థి బౌలర్లకు ఇవ్వాల్సిందే. ఇక లక్నో బ్యాటర్లు కూడా గొప్పగా ఆడారు. ఈ వికెట్ మీద ఫాస్ట్ బౌలర్ల నుంచి మేమెంతో ఆశించాము. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. బౌలింగ్‌లో మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాము.
వాళ్లు కూడా గొప్పగా షాట్లు ఆడారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ అద్భుతం చేశాడు. ఏదేమైనా ప్రత్యర్థి జట్టు మనకన్నా గొప్పగా ఆడినపుడు ఆ నిజాన్ని అంగీకరించాలి. మేము కూడా ఇంకాస్త పట్టుదలగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని పేర్కొన్నాడు.


