ESPN వ్యవస్థాపకుడు కన్నుమూత | ESPN Founder Bill Rasmussen No More | Sakshi
Sakshi News home page

ESPN-Bill Rasmussen: విజనరీ పారిశ్రామికవేత్త బిల్ రాస్ముసెన్ మృతి

Aug 18 2026 11:23 PM | Updated on Aug 18 2026 11:23 PM

ESPN Founder Bill Rasmussen No More

ఈఎస్‌పీఎన్(ESPN) వ్యవస్థాపకుడు, క్రీడా ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన విజనరీ పారిశ్రామికవేత్త బిల్ రాస్ముసెన్ (93) మంగళవారం ఫ్లోరిడాలోని తన నివాసంలో కన్నుమూశారు. పార్కిన్సన్‌ వ్యాధితో ఆయన మృతి చెందినట్లు ఈఎస్‌పీఎన్ సంస్థ వెల్లడించింది. 1970ల చివరలో తన కొడుకు స్కాట్ రాస్ముసెన్‌తో కలిసి ఈఎస్‌పీఎన్ ఆలోచనకు ఈయన రూపకల్పన చేశారు. 24 గంటల పాటు కేవలం క్రీడలు మాత్రమే ప్రసారం చేయాలనే ఆలోచన అప్పట్లో సాహసోపేతమైన నిర్ణయం. కానీ దాన్ని చేసి అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు.

న్యూ ఇంగ్లాండ్ వేలర్స్‌లో కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన రాస్ముసెన్.. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన సొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టడంతో పాటు, క్రెడిట్ కార్డు మొత్తాన్ని కూడా వినియోగించారు. కమ్యూనికేషన్స్ శాటిలైట్‌లో స్థలం కోసం 9,000 డాలర్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అనంతరం క్రీడా లీగ్‌లు, కేబుల్ ఆపరేటర్లు, పెట్టుబడిదారులని కలిసి తన ప్లాన్ వివరించారు. ఫలితంగా 1979 సెప్టెంబర్ 7న ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ నెట్‌వర్క్ (ESPN) ప్రసారాలని ప్రారంభించింది.

బిల్ రాస్ముసెన్.. ఈఎస్‌పీఎన్‌కు తొలి అధ్యక్షుడు, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. సంస్థ నుంచి వైదొలిగిన తర్వాత మీడియా రంగంలో పలు కార్యక్రమాల్లో కొనసాగారు. తన వ్యాపార ప్రయాణాన్ని వివరిస్తూ 'స్పోర్ట్స్ జంకీస్ రెజోయిస్: ద బర్త్ ఆఫ్ ESPN' అనే పుస్తకాన్ని రాశారు. ఈయన భార్య లోయిస్ 2011లో చనిపోయారు. రాస్ముసెన్‌కు కొడుకులు స్కాట్, గ్లెన్, కూతురు లిన్, ఏడుగురు మనుమలు, ఇద్దరు మునిమనుమలు ఉన్నారు. సోదరులు రాబర్ట్, డొనాల్డ్, సోదరి వివియన్, మనవడు జస్టిన్ వాన్ హోలెబెక్ గతంలోనే కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement