వయస్సు, అనుభవం ఆవిష్కరణకు అడ్డు కాదని నిరూపించింది ఇరవై రెండు సంవత్సరాల అలెశాండ్రా గలీ. పా΄ర్కిన్సన్ వ్యాధిగ్రస్తులపై ఆమె సానుభూతి కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఉపకరించే ఆవిష్కరణ ఇది. నెదర్‌లాండ్స్‌లోని డెలప్స్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల్లో అలెశాండ్రా గలీ, పార్కిన్సన్ రోగులు ఎదుర్కొంటున్న రోజువారి ఇబ్బందులను చూసి చలించిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పార్కిన్సన్ రోగులు ఉన్నారు, వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి అధ్యయనం చేసింది. కీబోర్డ్‌ను ఉపయోగించడంలో వారు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకుంది. ఆధునిక గేమింగ్ బోర్డ్‌ల నుంచి ప్రేరణ పొంది ‘ఆన్‌క్యూ’ అనే కీబోర్డ్‌ను రూదిపొందించింది. పార్కిన్‌సన్ రోగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టైప్ చేయడానికి ‘ఆన్‌క్యూ’ కీబోర్డ్ ఉపయోగపడుతుంది.
రోజువారీ అవసరాలకు అనుగుణంగా వైబ్రేషన్, లైట్ సిగ్నల్స్ తీవ్రతను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ ఆవిష్కరణకు జేమ్స్ డైసన్ అవార్డు అందుకుంది అలెశాండ్రా. ‘ఆన్‌క్యూ అనేది ఆవిష్కరణ మాత్రమే కాదు. ఇందులో తత్వం కూడా ఉంది. సాంకేతికతను సామాజిక సేవకు ఉపయోగించాలనేది ఆ తత్వం’ అంటుంది అలెశాండ్రా.


