జన్యు మార్పిడి చేసిన సూక్ష్మజీవిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్త
ఎడిన్‌బరో వర్సిటీ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
రోజువారీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరమైన ఔషధాలుగా మార్చటం సాధ్యమేనని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ‘వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఎందుకు పనికొస్తాయి... నేల, నీటిని కలుషితం చేయడానికి తప్ప’అని అనుకుంటూ ఉంటాం. కానీ, అది నిజం కాదు. పాత ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించి అద్భుతమైన ఔషధం తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వృద్ధుల వ్యాధుల్లో ఒకటైన పార్కిన్సన్‌కు చెక్ చెప్పే అద్భుత ఔషధాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచంలో తొలిసారి తయారు చేశారు.
నేచర్ సస్టయినబిలిటీ జర్నల్‌లో ఈ పరిశోధనా వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం పర్యావరణ భారం మాత్రమే కాదని, ప్లాస్టిక్ రసాయన నిర్మాణంలో బంధితమైన కార్బన్ అణువులను ఔషధాల తయారీకి వనరుగా వాడుకోవచ్చని పరిశోధకులు నిరూపించారు. జన్యుమారి్పడి చేసిన ఈ–కోలి సూక్ష్మక్రిమి ఈ కార్బన్‌ను మార్చగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణంగా సీసాలు, ఆహార ప్యాకేజింగ్‌లో ఉపయోగించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ)తో పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు కీలకమైన లెవోడోపా మందును తయారు చేశారు.
ప్రస్తుతం లెవోడోపా మందును ఉత్పత్తి చేసే ప్రక్రియ అనేక శిలాజ ఇంధన ఆధారిత రసాయన దశలపై ఆధారపడి ఉంటుంది. అధిక శక్తి వినియోగంతో కూడిన అధిక కార్బన్‌ను విడుదల చేసే ఖరీదైన ప్రక్రియ ఇది. ఈ సంప్రదాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ సీసాలతో మందులు తయారు చేయొచ్చని కనుగొన్నారు.
అయితే ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ పరిశోధకులే ప్లాస్టిక్‌తో పారాసెటమాల్ ట్యాబ్లెట్లను తయారు చేసే పద్ధతిని గతంలో కనిపెట్టారు. కేవలం 24 గంటల్లోనే ఒక లీటరు పీఈటీ సీసాలోని 90% వరకు ప్లాస్టిక్‌ను పారాసెటమాల్‌గా మార్చారు. 500 ఎంజీ పారాసెటమాల్ మాత్రలు నాలుగు తయారు చేయటానికి ఇది సరిపోతుంది.
పార్కిన్సన్ బాధితులు కోటి
వయోవృద్ధులకు వణుకు, కండరాలను బిగుతుగా మార్చేసే సమస్యలను కలిగించే జబ్బే పార్కిన్సన్. ప్రపంచవ్యాప్తంగా కోటిమంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలను నియంత్రిచడానికి లెవోడోపా అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా మారింది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ జబ్బును నయం చేసే ఔషధాల అవసరమూ పెరుగుతోంది. దీంతో లెవోడోపాను ఉత్పత్తి చేయటానికి సుస్థిరమైన మార్గాలను కనుగొనటం అత్యంత ఆవశ్యకమైంది. ప్రయోగశాలలో సాధించిన ఈ అద్భుత ఆవిష్కరణ ఎంత ఉత్తేజకరమైనదైనా, పారిశ్రామిక స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఔషధాలు ఉత్పత్తి ప్రారంభించే దశకు రావటం రాత్రికి రాత్రే జరగదు.
ఇంజనీర్లు తక్కువ ఖర్చుతో కూడిన తయారీ ప్రక్రియలను అభివృద్ధి చేయాలి. అలాగే ఉత్పత్తులు కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నియంత్రణ సంస్థలు సంతృప్తి చెందాలి. ఇందుకు చాలా కాలమే పడుతుంది. పెట్టుబడి భారీగానే అవసరమవుతుంది. శాస్త్రవేత్తలు, పరిశ్రమదారులు, విధాన రూపకర్తల మధ్య సన్నిహిత సమన్వయం అవసరం. ఏదేమైనా ఈ అద్భుత ఆవిష్కరణ సమీప భవిష్యత్‌లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను ఔషధాలుగా మార్చే ఉత్పత్తి ప్రారంభ దశకు చేరుతుందని ఆశిద్దాం.


