పాక్‌ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా! | No Salman Babar Pakistan Announce Squad for Asian Games 2026 | Sakshi
Sakshi News home page

Asian Games 2026: పాక్‌ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!

Jun 10 2026 12:13 PM | Updated on Jun 10 2026 12:36 PM

No Salman Babar Pakistan Announce Squad for Asian Games 2026

ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. సల్మాన్‌ ఆఘాను తప్పించి అతడి స్థానంలో సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు సారథిగా పగ్గాలు అప్పగించింది.

స్టార్లు లేకుండానే...
ఆసియా క్రీడల్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ షా ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ తదితరుల పేర్లు కనిపించలేదు. సల్మాన్‌ సహా వీరందరికీ విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

కొత్త ముఖాలకు చోటు
ఈ క్రమంలోనే పాక్‌ ఫర్హాన్‌ కెప్టెన్సీలో ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా క్రీడలకు పంపనుంది. ఈ ఈవెంట్లో ఫర్హాన్‌కు డిప్యూటీగా అబ్దుల్‌ సమద్‌ వ్యవహరించనున్నాడు. ఇక ఇంతవరకు అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయని ఆకిఫ్‌ జావేద్‌, అలీ రెజా, మాజ్‌ సదాకత్‌, సాద్‌ మసూద్‌లకు కూడా సెలక్టర్లు ఆసియా క్రీడల జట్టులో చోటిచ్చారు.

పీసీబీ ఇలా.. బీసీసీఐ అలా
మరోవైపు.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి జట్టును పంపేందుకు సిద్ధమైంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కూడా ఈ జట్టుకు ఎంపిక చేసింది.

ముఖాముఖి పోరు ఉంటుందా?
కాగా లీగ్‌ దశలో భారత్‌- పాకిస్తాన్‌ తలపడే పరిస్థితి లేకపోవచ్చు. అయితే, సెమీస్‌ లేదంటే ఫైనల్లో దాయాదులు ముఖాముఖి ఎదురుపడే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా కప్‌-2026, టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీల్లో భారత్‌ చేతిలో పాక్‌ మరోసారి భంగపడ్డ సంగతి తెలిసిందే.

ఆసియా కప్‌లో ఫైనల్‌ చేరినప్పటికీ.. వరల్డ్‌కప్‌ టోర్నీలో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి జట్టును కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును పీసీబీ రంగంలోకి దించడం విశేషం.

తొలిసారి సారథిగా
ఇదిలా ఉంటే.. 30 ఏళ్ల సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ఇప్పటి వరకు పాకిస్తాన్‌ తరఫున 46 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రెండు శతకాలు, పది అర్ధ శతకాల సాయంతో 1305 పరుగులు సాధించాడు. ఆసియా క్రీడల సందర్భంగా తొలిసారిగా పాక్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 4 వరకు జపాన్‌ వేదికగా ఆసియా క్రీడలు- 2026 జరుగనున్నాయి. ఇక క్రికెట్‌ పోటీలను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. కాగా 2023లో బీసీసీఐ తొలిసారిగా పురుష, మహిళా జట్లను ఆసియా క్రీడలకు పంపగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ల సారథ్యంలో భారత్‌ రెండు విభాగాల్లోనూ పసిడి పతకాలు సాధించింది.

ఆసియా క్రీడలకు పాక్‌ జట్టు
సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్ (వైస్‌ కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), సుఫీయాన్ ముకీమ్‌.

చదవండి: ‘అతడు పేరుకే ఆల్‌రౌండర్‌.. జట్టులో దండగ’

Advertisement
 
Advertisement
Advertisement