పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. తమ అండర్-19 జట్టును ఇంగ్లండ్ పర్యటనకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఒక ఫోర్ డే మ్యాచ్‌తో పాటు నాలుగు యూత్ వన్డేలు ఆడననున్నట్లు తెలిపింది.
కాగా పాక్ అండర్-19 జట్టు చివరగా 2023లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాడు రెండు యూత్ టెస్టులతో పాటు ఐదు యూత్ వన్డేలు ఆడింది. టెస్టు సిరీస్ డ్రా కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.
భవిష్య ఈవెంట్లకు సన్నాహకంగా..
ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి యంగ్ షాహిన్స్ జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. కాగా పాక్ అండర్-19 టీమ్ గతేడాది కాలంగా మంచి ఫామ్‌లో ఉంది. ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత జట్టును ఓడించి టైటిల్ గెలిచింది.
ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజయం సాధించింది. జింబాబ్వే, అఫ్గనిస్తాన్‌లపై గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2025 టోర్నీలో మాత్రం పాక్ ఐదింట కేవలం మూడే గెలిచింది. ఇంగ్లండ్‌తో పాటు భారత్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
ఈ టోర్నీలో యువ భారత జట్టు గెలుపొంది.. ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇదిలా ఉంటే.. రానున్న ఐసీసీ ఈవెంట్లకు సన్నాహకంగా పాక్ అండర్-19 జట్టుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులపై పాక్ యువ ఆటగాళ్లు అవగాహన పెంపొందించుకునేలా ఈ టూర్ ఉపయోగపడనుంది. ఆసియా కప్‌తో పాటు భవిష్య ముక్కోణపు సిరీస్‌లకు ఈ పర్యటన ద్వారా మంచి ప్రాక్టీస్ దొరకనుంది.
ఇంగ్లండ్ అండర్-19 వర్సెస్ పాక్ అండర్-19 సిరీస్ షెడ్యూల్
👉యూత్ టెస్టు: సెప్టెంబరు 2-5- అరుండేల్
👉తొలి యూత్ వన్డే: సెప్టెంబరు 9- అరుండేల్
👉రెండో యూత్ వన్డే: సెప్టెంబరు 12- గిల్డ్‌ఫోర్డ్
👉మూడో యూత్ వన్డే: సెప్టెంబరు 14- వార్మ్‌స్లే
👉నాలుగో యూత్ వన్డే: సెప్టెంబరు 16- వార్మ్‌స్లే.


