శ్రీశైలానికి తగ్గిన వరద | Flood flow to Srisailam project has reduced significantly | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి తగ్గిన వరద

Aug 10 2026 4:30 AM | Updated on Aug 10 2026 4:30 AM

Flood flow to Srisailam project has reduced significantly

ఆల్మట్టి, నారాయణపూర్‌లలో సైతం 

పోతిరెడ్డిపాడు, హంద్రి నీవా ద్వారా ఏపీ నీటి తరలింపు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ /గద్వాల/ అచ్చంపేట: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,01,384 క్యూసెక్కులు జలాశయంలోకి వచ్చి చేరుతుండగా, జలాశయంలో నిల్వలు 181.05 టీఎంసీలకు చేరాయి. గరిష్ట నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, మరో 34 టీఎంసీలు వచ్చి చేరితే జలాశయం నిండుతుంది. గత వారం రోజులుగా రోజుకు 20 టీఎంసీల వరకు వరద రాగా, ప్రస్తుతం రోజుకు 10 టీఎంసీలకు తగ్గిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రినీవా ద్వారా 2,500 క్యూసెక్కులు, కుడి విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 4,563 క్యూసెక్కుల నీటిని వాడుకుంటోంది. 

తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి మొత్తం 17,463 క్యూసెక్కు నీటిని వాడుకుంటున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయినీ, జూరాల నుంచి వస్తున్న వరద సైతం గణనీయంగా తగ్గిపోయింది. సోమవారం నాటికి జలాశయానికి ఇన్‌ఫ్లో 44వేల క్యూసెక్కులకు తగ్గిపోనున్నాయి. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకుంటుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయం నిండే సూచనలు కనిపించడం లేదు. 

కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 1,04,777 క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువన కృష్ణానదికి 42,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌ జలాశయానికి 42,000 క్యూసెక్కుల వరద వస్తుండగా, 35,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 57,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 44,279 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో నాగార్జునసాగర్‌లోకి 13,435 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement