ఎయిరిండియా కొత్త సీఈవో.. పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు జస్ట్‌ మిస్‌! | Tewolde Gebremariam Named Air India CEO; Was Also in Race for PIA Top Role | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు వెళ్లాల్సిన వ్యక్తి.. ఇప్పుడు ఎయిరిండియా సీఈవో

Aug 7 2026 12:39 PM | Updated on Aug 7 2026 12:47 PM

Air India New CEO Tewolde Gebremariam Also in Line Pakistan Airlines CEO Job

ఎయిర్‌ ఇండియా కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (CEO), మేనేజింగ్‌ డైరెక్టర్‌ (MD)గా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌  మాజీ గ్రూప్‌ సీఈవో టెవోల్డే గెబ్రెమరియం నియమితులయ్యారు. ఎయిర్‌ ఇండియా బోర్డు ఆగస్టు 5న ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న క్యాంప్‌బెల్‌ విల్సన్‌ సెప్టెంబర్‌ 30లోపు పదవి నుంచి తప్పుకోనున్నారు.

అయితే గెబ్రెమరియం నియామకంలో ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది. కొన్ని వారాల క్రితం ఆయన పేరు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (PIA) సీఈవో పదవికి ప్రముఖంగా వినిపించింది. జూలైలో వచ్చిన బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. పీఐఏ సీఈవోగా ఆయన ఎంపిక తుది దశలో ఉంది. అనంతరం అరబ్‌ న్యూస్‌ కూడా గెబ్రెమరియంను పీఐఏ ఎంపిక చేసిందని, భద్రతా అనుమతులు పూర్తయ్యే వరకు అధికారిక ప్రకటనను నిలిపివేసిందని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ వెల్లడించింది.

కానీ ఆ నియామకం కార్యరూపం దాల్చకముందే పరిస్థితి మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులను పరిశీలించిన అనంతరం ఎయిర్‌ ఇండియా బోర్డు గెబ్రెమరియంను ఎంపిక చేసింది. టాటా సన్స్‌ చైర్మన్‌, ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. విల్సన్‌ నేతృత్వంలో ఎయిర్‌లైన్‌ స్థిరీకరణ, విమానాల ఆధునికీకరణ, విలీన ప్రక్రియ వంటి ప్రారంభ దశ పనులను పూర్తి చేసిందని, ఇప్పుడు అమలు, సామర్థ్యం, లాభదాయక వృద్ధిపై మరింత దృష్టి పెట్టాల్సిన దశ వచ్చిందని తెలిపారు.

ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ను మార్చిన అనుభవం

గెబ్రెమరియంకు విమానయాన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. 2011లో గ్రూప్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టి 2022లో పదవి నుంచి వైదొలిగారు. ఆయన నాయకత్వంలో సంస్థ ఆదాయం సుమారు 1 బిలియన్‌ డాలర్ల నుంచి 4.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. విమానాల సంఖ్య 33 నుంచి 130కి, ప్రయాణికుల సంఖ్య కొవిడ్‌కు ముందు 3 మిలియన్ల నుంచి 12 మిలియన్లకు పెరిగింది.

ఆఫ్రికా విమానయాన రంగంలో ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ను అతిపెద్ద, అత్యంత విజయవంతమైన క్యారియర్‌లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో గెబ్రెమరియం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ రూట్‌ నెట్‌వర్క్‌, కార్గో కార్యకలాపాలు, శిక్షణ, నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు కొవిడ్‌ సమయంలోనూ సంస్థను నిలబెట్టడంలో ఆయన అనుభవం ఉపయోగపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement