గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాలు (కన్సాలిడేటెడ్) మరింతగా పెరిగాయి. రూ. 10,859 కోట్ల నుంచి రూ. 22,238 కోట్లకు ఎగిశాయి. మొత్తం ఆదాయం రూ. 78,636 కోట్ల నుంచి రూ. 71,870 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 89,317 కోట్ల నుంచి రూ. 93,733 కోట్లకు చేరాయి. విదేశీ మారకానికి సంబంధించిన నష్టాలు రూ. 1,545 కోట్ల నుంచి రూ. 7,388 కోట్లకు పెరిగాయి.
విమానాల మరమ్మతులు, నిర్వహణ వ్యయాలు రూ. 13,901 కోట్ల నుంచి రూ. 14,976 కోట్లకు పెరగ్గా, ఇంధన వ్యయాలు మాత్రం రూ. 29,023 కోట్ల నుంచి రూ. 26,872 కోట్లకు తగ్గాయి. ఏఐ 171 విమాన ప్రమాదం, భౌగోళిక–రాజకీయ పరిస్థితులపరమైన సమస్యలు, గగనతలాల మూసివేతలు, ఇంధన ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం సహా నిర్వహణపరంగా పలు సవాళ్లతో ఎయిరిండియా సతమతమవుతోంది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఎయిరిండియా నష్టం రూ. 3,976 కోట్ల నుంచి రూ. 15,368 కోట్లకు ఎగిసింది. ఆదాయం రూ. 64,343 కోట్ల నుంచి రూ. 53,662 కోట్లకు తగ్గింది.
కీలక విడిభాగాల సరఫరాలో సంవత్సరాల తరబడి అంతరాయాలు ఏర్పడటం, వారసత్వంగా వచ్చిన విధానాలు, సంస్కృతిలో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నందున ఎయిరిండియా ప్రస్థానాన్ని ఐదు నుంచి పదేళ్ల కోణంలో చూడాల్సి ఉంటుందని జూలైలో విడుదల చేసిన 2025–26 వార్షిక నివేదికలో టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఎయిరిండియా కొత్త ఎండీ, సీఈవోగా త్వరలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ చీఫ్ తెవోల్డ్ గెబ్రెమరియం బాధ్యతలు చేపట్టనున్నారు.


