హైదరాబాద్: అర్ధరాత్రి సమయం... ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. ఎందుకో తలుపు అలికిడి వినిపించింది. ఒంటిపై చొక్కా, కింది భాగాన చెడ్డీ ధరించిన ఓ దొంగ తలుపును కొడుతున్నాడు. భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో పరుగు లంకించుకున్నాడు. బతుకు దేవుడా! అంటూ బాధితులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మేడిపల్లి ఠాణా పరిధి బోడుప్పల్‌లోని రాఘవేంద్ర కాలనీలో కలకలం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాఘవేంద్ర కాలనీలో ఓ కుటుంబం సోమవారం అర్ధరాత్రి గాఢనిద్రలో ఉంది. ఈ నేపథ్యంలో చెడ్డీ ధరించిన దొంగ.. చేతిలో సెల్‌ఫోన్‌తో పక్కనే ఉన్న భవనం నుంచి రెయిలింగ్ దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు.
అనంతరం ఇంటి ప్రధాన తలుపును బద్దలు కొట్టేందుకు ప్రయతి్నంచాడు. తలుపు వద్ద భారీ శబ్దాలు రావడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు వెంటనే గోడ దూకి పరారయ్యాడు. అర్ధరాత్రి వేళ కుటుంభ సభ్యులు ఇంట్లో ఉండగానే చెడ్డీ దొంగ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయతి్నంచడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో రాఘవేంద్ర కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రిపూట పోలీసుల గస్తీని మరింత ముమ్మరం చేయాలని కోరుతున్నారు.


