హైదరాబాద్‌ టు తిరుపతి రూ. 18,315! | Airfares increased from Hyderabad to Tirupati | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు తిరుపతి రూ. 18,315!

Aug 12 2026 5:57 AM | Updated on Aug 12 2026 5:58 AM

Airfares increased from Hyderabad to Tirupati

విమాన చార్జీలకు రెక్కలు.. వివిధ రూట్లలో భారీగా పెరిగిన చార్జీలు 

అనూహ్యంగా పెరిగిన ప్రయాణికుల డిమాండ్‌ 

శ్రావణ మాసంలో శుభకార్యాలు కూడా కారణమే

సాక్షి, హైదరాబాద్‌: విమాన చార్జీలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాల్లో భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు పలు ఎయిర్‌లైన్స్‌ చార్జీలను రెట్టింపు చేశాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి సాధారణంగా రూ. 3,500 నుంచి రూ. 4,200 మధ్య ఉండే చార్జీ ప్రస్తుతం ఏకంగా రూ. 13,303 వరకు పెరిగింది. ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఎయిరిండియా చార్జీ రూ. 15,600 నుంచి రూ. 18,315 మధ్య ఉంది. మిగతా రూట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబై, ఢిల్లీ, విశాఖ తదితర నగరాలకు సైతం విమాన చార్జీలు చుక్కలంటుతున్నాయి. 

పెళ్లిళ్లు, శుభకార్యాల దృష్ట్యా ఈ నెల నుంచి ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగనున్న దృష్ట్యా చార్జీలపై ఈ ప్రభావం కనిపిస్తుందని పర్యాటక సంస్థలకు చెందిన ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ‘ఆషాఢ మాసం కారణంగా నెల రోజులుగా వివిధ మార్గాల్లో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. త్వరలో శ్రావణం ప్రవేశించనుంది. తిరుపతికి వెళ్లే భక్తుల తాకిడి పెరగడం వల్ల కూడా చార్జీలు అనూహ్యంగా రెట్టింపయ్యాయి’అని సికింద్రాబాద్‌కు చెందిన ట్రావెల్స్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మేరకు బుకింగ్‌లు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రతిరోజూ సుమారు 55 వేల మంది డొమెస్టిక్‌ ప్రయాణికులు దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తున్నారు.

ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి వివిధ మార్గాల్లో విమాన చార్జీలు ఇలా.. 
⇒    తిరుపతికి రూ.13,303 (ఇండిగో), రూ. 18,315 (ఎయిరిండియా) 
⇒    ముంబైకి రూ. 6,832 నుంచి రూ.7062(ఇండిగో), రూ. 8,116 (ఎయిరిండియా) 
⇒    ఢిల్లీకి రూ. 7,147 నుంచి రూ. 8016 (ఇండిగో). రూ. 9,667 నుంచి రూ. 11,162 (ఎయిరిండియా) 
⇒     విశాఖకు రూ. 9,467 (ఇండిగో), రూ.9667 వరకు (ఎయిరిండియా) 
⇒   బెంగళూరుకు రూ. 4627 (ఇండిగో), రూ. 6,965 (ఎయిరిండియా) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement