కర్ణాటక: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్‌లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది.
బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.


