ప్రియాంక కేసు.. నిందితుల కాల్‌ డేటా ఏదీ?: మార్గాని భరత్‌ | Rajahmundry Doctor Priyanka Death Case, YSRCP Margani Bharat Demands Transparent Probe, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రియాంక కేసు.. నిందితుల కాల్‌ డేటా ఏదీ?: మార్గాని భరత్‌

Aug 11 2026 12:37 PM | Updated on Aug 11 2026 1:10 PM

Rajahmundry Priyanka Case: YSRCP Bharat Demands Transparent Probe

సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. 

డాక్టర్‌ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’
ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

‘చిన్న యాక్సిడెంట్‌గా ఎలా చెబుతారు?’
డాక్టర్‌ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.

‘నిందితుల ఫోన్‌ డేటా ఎందుకు సేకరించలేదు?’
హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్‌ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్‌ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.

‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’
స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్‌ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్‌ ప్రశ్నించారు. 

సోషల్‌ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?
రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్‌ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’
ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్‌ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్‌ చేసినట్లు చూపించారని ఆరోపించారు.

సీఐపై చర్యలు ఎందుకు లేవు?
ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్‌నగర్‌ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్‌ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement